
గోవిందదాసుడిగా ఎన్ని కష్టాలకై నా సిద్ధం
తిరుపతి మంగళం : శ్రీరాముడి పట్ల అకుంటితమైన పరమభక్తుడిగా ఆనాడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో.. అదేవిధంగా ఈరోజు గోవిందదాసుడిగా శ్రీవారి ఆలయ పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం తాను ఎన్ని కష్టాలు పడడానికై నా సిద్ధమేనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాల చెంత మలమూత్రాలు, మద్యం బాటిళ్ల మధ్య మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ పాలకవర్గం, అధికారులు పడవేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఎత్తిచూపితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు ఎదురు దాడులకు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా టీటీడీ పాలకవర్గం, టీడీపీ, జనసేన నాయకులు దానికి రాజకీయ రంగు పులమడం వారి నీచతత్వానికి నిదర్శనమన్నారు. మహావిష్ణువు విగ్రహం కాదని, శనేశ్వరస్వామి విగ్రహమని, గత 20 ఏళ్లుగా ఉందని, అసంపూర్తిగా ఉన్న శనేశ్వరస్వామి విగ్రహం గనుక పట్టించుకోలేదంటూ రకరకాలుగా చెబుతున్నారన్నారు. ఆ విగ్రహం ముమ్మాటికీ మహావిష్ణువు విగ్రహం అనడానికి ఎలాంటి సందేహం లేదని స్పష్టంచేశారు. రాయలచెరువు దగ్గర తయారు చేసిన శనేశ్వరస్వామి విగ్రహాన్ని టీటీడీ స్థలంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఇలాంటి కేసులకు భయపడేవాడిని కాదని, తనపై ఎన్ని కేసులు పెట్టినా హైందవ ధర్మ పరిరక్షణను, శ్రీవారి ప్రతిష్టను కాపాడుకునేందుకు టీటీడీలో జరిగే తప్పిదాలను ఎత్తిచూపుతూనే ఉంటానన్నారు.