
మహిళా దొంగలు పట్టివేత
పలమనేరు : పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహల్‌లో చాకచక్యంగా బంగారాన్ని దొంగలించే ఇరువురు మహిళా దొంగలను దుకాణ నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారం పలమనేరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. మధ్య వయస్కులైన ఇరువురు మహిళలు తమిళ, తెలుగు యాసలో మాట్లాడుతూ.. దుకాణంలోకి వచ్చి బంగారు కమ్మలు కావాలని అడిగి పలు రకాలు చూశారు. ఇంకో మోడల్ అంటూ చూడడం మొదలు పెట్టారు. ఎందుకో వీరిపై అనుమానం కలిగిన దుకాణ యజమాని సీసీ కెమెరాలో వీరిని గమనించడం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు దొంగలు ముందుగానే తెచ్చుకున్న డూప్లికేట్ రెండు గ్రాముల కమ్మలను అక్కడ పెట్టి బాక్సులోని ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలను తీసుకెళ్లారు. దీంతో ఈ చోరీని గమనించిన దుకాణ నిర్వాహకులు ఆ ఇద్దరు మహిళలను పట్టుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున పోలీసులు అక్కడ జరిగిన చోరీని సీసీ కెమెరాల్లో గమనించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరు తమిళనాడుకు చెందిన చేయి తిరిగిన బంగారు దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించి ఆపై మిగిలిన విషయాలను వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.