
ప్రక్షాళన జరిగేనా?
ప్రజల్లో ఖాకీలపై నమ్మకం కల్పించేనా? ఎస్పీకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో స్పెషల్ బ్రాంచ్ విఫలం వీధి వీధిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు మితిమీరిన రాజకీయ జోక్యం అరికట్టేనా! చిత్తూరు నూతన ఎస్పీ ఎదుట పలు సవాళ్లు
చిత్తూరు అర్బన్ : ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్నది పెద్దల మాట. పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకం కల్పించి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు బాటలు వేస్తామని చిత్తూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుషార్ డూడీ.. ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు. ఖాకీలపై ప్రజల్లో నమ్మకం రావాలంటే ముందుగా సొంత శాఖను ప్రక్షాళన చేయడానికి పూనుకోవాల్సిందే. ఆపై ఒకరు చెప్పకున్నా సమాజంలో పోలీసులపై ప్రజలకు కచ్చితంగా నమ్మకం కలుగుతుంది.
తొలి అడుగు ఎస్‌బీ నుంచే చేపట్టాలి!
జిల్లా పోలీసుశాఖ ఎస్పీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఎస్పీ తరువాత పోలీసుల పనితీరు, సమాజంలో జరుగుతున్న పరిస్థితిని తెలుసుకోవాల్సింది స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగం. ఎస్పీ తరువాత ఏ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి..? పోలీస్ స్టేషన్‌లో అవినీతి విచ్చలవిడిగా ఉందా..? ఎస్‌హెచ్‌వోలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు? లాటరీ టికెట్ల కింగ్‌పిన్ ఎవరు? పోలీసు వెల్ఫేర్‌కు ఏం చేయాలి? వయసు మళ్లిన తల్లిదండ్రులకు చూసుకోవాడానికి కానిస్టేబుల్‌కు ఏ స్టేషన్‌కు డీవో వేస్తే బాగుంటుంది? స్టేషన్లలో వసూల్ రాజాలు ఎవరు? ఇలా చాలా విషయాలను తెలుసుకుని ఎస్పీకు ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత ఎస్‌బీ విభాగంపై ఉంది. కానీ కొన్ని నెలలుగా ఎస్‌బీ నిస్తేజమైపోయింది. కొన్ని విషయాలు తెలిసినా ఎస్పీ వద్దకు వెళ్లి చెప్పే ధైర్యం చేయలేకపోవడం. మరికొన్ని వాస్తవాలు చెబితే ఎస్పీ ఏమనుకుంటారో అనే అనుమానం. పైగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎస్‌బీలో చాలా వరకు ఒకే సామాజిక వర్గం ఉండటం, వాళ్లకు అధికారపార్టీ నేతలతో సన్నిహిత సంబంధాల కారణంగా వాస్తవాలు ఏమాత్రం ఎస్పీకు తెలియడంలేదు. ఎవరేమనుకున్నా తనకు జరుగుతున్న నిజాలు ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే మాత్రం ఎస్‌బీ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది.
పారదర్శకతకు పెద్దపీట వేయాలి
ఇప్పుడంతా స్మార్ట్ కాలం నడుస్తోంది. ఓ కానిస్టేబుల్ రూ.వంద తీసుకుంటే అప్పటికప్పుడే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, వార్తలు వైరల్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో సంబంధింత కానిస్టేబుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారని సామాన్యులే హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే, విచారణకు ఆదేశించి వాటిని మూలన పడేయకుండా ఆరోపణలు నిజమా, కాదా అని చెప్పడంతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలీసుశాఖలో దేశ భద్రత అంశాలు తప్ప.. అధికారులు పారదర్శకత పాటిస్తే ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం పెరుగుతుంది. ఇదే సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిందితులను కాపాడటానికి రాజకీయ నాయకుల సిఫార్సును పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పోలీసుశాఖ ఉదాసీనతగా ఉంటే.. తప్పు చేసిన వాళ్లు తమ ఎమ్మెల్యేలు అయినా వదలొద్దని స్వయానా సీఎం చెబుతున్న మాటలు నీటిమూటలైపోతాయనే విషయం గుర్తించుకోవాలి.
ఒడిస్సా, విశాఖ నుంచి పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, కుప్పానికి దిగుమతవుతున్న గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. దుకాణాల్లో సిగరెట్లు దొరికినంత సులువుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి.
నిషేధిత లాటరీ టికెట్లు చిత్తూరు కేంద్రంగా జరుగుతూ.. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, తిరుపతి మీదుగా విజయవాడ వరకు ఎగుమతి అవుతున్నాయి.
మాదకద్రవ్యాల నివారణ కోసం ఏర్పాటైన ‘ఈగల్’ పేరుకు గంభీరంగా ఉన్నా, ఎగరలేని పరిస్థితి. ఇటీవల ఇందులోని ఓ ఖాకీ ఏకంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి సస్పెండ్‌కు గురవడం చర్చనీయాంశమయ్యింది.
చిత్తూరుతో పాటు నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, యాదమరి, పలమనేరు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ నెలకు రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.
చీకటి పడితే చిత్తూరు గాంధీ విగ్రహం సాక్ష్యంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా అక్రమ గ్రానైట్ దిమ్మెల స్మగ్లింగ్, అధికార పార్టీ నాయకుల సివిల్ సెటిల్ మెంట్లు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. మరి కొత్త ఎస్పీ డూడీ.. ఈ సమస్యలను అధిగమించి, శాంతి భద్రతల పర్యవేక్షణలో సఫలీకృతులవుతారని ప్రజలు ఆశిస్తున్నారు.

ప్రక్షాళన జరిగేనా?