
‘స్మార్ట్’ బాదుడు !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విద్యుత్ సర్వీసుల వివరాలు
ప్రభుత్వ కార్యాలయాలకు 90 శాతం వరకు స్మార్ట్ మీటర్ల బిగించేశారు.
వాణిజ్య వినియోగదారుల కనెక్షన్లకు ఇప్పటి వరకు 10 శాతం బిగించారు.
స్మార్ట్ మీటర్లు అంటూ ఎవరైనా వస్తే వాటిని పగులగొట్టండి.. మీకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నేడు అధికారంలోకి రాగానే అదే స్మార్ట్ మీటర్లను పెట్టడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ముందుగా కమర్షియల్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో రూ.2 వేలు నుంచి 4 వేలు వస్తున్న కరెంట్ బిల్లు నేడు ఏకంగా రూ.25 వేలు నుంచి రూ.70 వేలు వరకు వస్తుండడంతో చిరు వ్యాపారులు వణకిపోతున్నారు. వ్యాపారాలను మూసివేయడం తప్ప తమకు మరోదారి లేదంటూ విలపిస్తున్నారు.
పుత్తూరు : కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగులగొట్టండి అంటూ బహిరంగ వేదికలపై ప్రకటనలు చేశారు. అధికారంలోకి రాగానే అదే విధానాన్ని చంద్రబాబు అమలు చేయడంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఇలా బిల్లుల పేరిట దోపిడీకి దిగితే తాము ఎవరితో మొరపెట్టుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వ్యాపారాలే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
మూతపడనున్న చిన్న పరిశ్రమలు
చిన్నపాటి యంత్రాల ఆధారంగా, కొంత మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ నడిచే చిన్నపాటి పరిశ్రమలు కూటమి బాదుడుకు మూతకు సిద్ధమవుతున్నాయి. ఈ తరహా పరిశ్రమలు పట్టణాలు, పల్లెల్లోనూ మనకు కనిపిస్తుంటాయి. ఇందులో కొయ్య తోపుడు యంత్రాలు, సిమెంట్ రాయి తయారీ, పిండి మిల్లులు, వెల్డింగ్ వర్క్ షాపులు, పవర్‌లూమ్స్, రెడీ మేడ్ డ్రస్సులు, ఫర్నీచర్ తయారీ వంటివి మనకు నిత్యం కనిపించేవి. కూటమి ప్రభుత్వం బిగించిన స్మార్ట్ మీటర్లతో వస్తున్న అధిక బిల్లులతో పరిశ్రమల నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేశారు. సరసమైన ధరలతో నిరంతర విద్యుత్ సరఫరా అయితే స్మార్ట్ మీటర్ల పేరిట రోడ్డున పడేస్తే ఎలా అంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నాడు మీటర్లు పగులగొట్టమన్నారు, ఈ రోజు అదే మీటర్ల కత్తిపైన కూర్చోబెట్టారు. ఇది ఎంత వరకు సమంజసమంటున్నారు. ఈ బిల్లుల బాధను తాము తట్టుకొని నిలబడలేమని, మూసివేయడమే తప్ప తమకు మరో మార్గం కనిపించడం లేదంటూ పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సమాచారం
హడలిపోతున్న గృహ వినియోగదారులు
ప్రస్తుత కాల పరిస్థితుల్లో టీవీ, కూలర్, ఏసీ, ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్, హీటర్ వంటివి సర్వ సాధారణంగా ప్రజలు వినియోగిస్తున్న ఎలక్ట్రికల్ వస్తువులు. వీటన్నింటిని వినియోగిస్తే ప్రస్తుతం నెలవారి బిల్లు మహా అంటే రూ.2 నుంచి 3 వేలు ఉంటోంది. ప్రస్తుత స్మార్ట్ మీటర్ల ఏర్పాటును పరిశీలిస్తే నెలకు రూ.10 వేల నుంచి 20 వేల బిల్లులు వస్తాయోమనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గృహ వినియోగదారులు 13,03,270
వాణిజ్య వినియోగదారులు 1,61,215 పరిశ్రమలు 21,175
ప్రభుత్వ కార్యాలయాలు 45,405
వ్యవసాయ వినియోగదారులు 3,32,264

‘స్మార్ట్’ బాదుడు !