
కామధేనువుపై లంబోధరుడు!
కాణిపాకం: ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆదివారం రాత్రి కామధేనువుపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామిని తిలకించి పరవశించారు. సాయంత్రం తొలుత అలంకార మండపంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయస్వామి ఉత్సమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి కామధేను వాహనంలో అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళాతాళాలు, కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా చేపట్టారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
నేడు పూలంగిసేవ...
ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సోమవారం పూలంగిసేవను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రి పూలంగిసేవ ఉంటుందన్నారు.

కామధేనువుపై లంబోధరుడు!