
ఆపేది ఎవడ్రా?
చిత్తూరు నగర నడిబొడ్డున ఉన్న భరత్ నగర్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆడ బిడ్డను చిదిమేసే ఈ పరీక్షలకు రూ.వేలల్లో వసూ లు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లడంతో స్వయానా ఆయనే రంగంలోకి దిగారు. పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి నిందితులపై చట్టపరంగా ముందుకు వెళ్లారు.
రూ.కోట్లు విలువ చేసే మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయానికి పెడితే కార్పొరేషన్ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. లెనిన్ నగర్‌లో జరిగిన ఈ దందాను అజ్ఞాత వ్యక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. అధికారులకు ఛీవాట్లు పెట్టి అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆపై భూమిని ఆధీనంలోకి తెచ్చుకున్న అధికారులు కేసు పెట్టకుండా మమ అనిపించారు.
చిత్తూరులోని గంగనపల్లెలో పేకాట క్లబ్బు నిర్వహిస్తున్నారని స్థానికంగా ఉన్న మహిళలు నేరుగా ఎస్పీ వాట్సాప్‌కు మెసేజ్ చేశారు. ఆ పరిధిలోకి వచ్చే పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా.. స్పెషల్ బ్రాంచ్ విభాగంతో దాడులు చేయించి 24 మందిపై ఎస్పీ కేసు నమోదు చేయించి, క్లబ్ మూయించారు. నిందితుల్లో అత్యధికులు.. ఫిర్యాదు చేసినవాళ్లు అధికారపార్టీ వాళ్లేనని సమాచారం.
పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి లాంటి ప్రాంతాలకు నిషేధిత లాటరీ టికెట్లు చిత్తూరు నుంచి ఎగుమతి చేస్తూ.. రోజుకు రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. చిత్తూరు నగరంలో పాత బస్టాండు, సుందరయ్యవీధి, గిరింపేట, చర్చీవీధి, బజారువీధి, ఓటీకే రోడ్డు ప్రాంతాల్లో బహిరంగంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్నా నామమాత్రపు కేసులు తప్ప.. అధికారపార్టీ ముసుగులో ఉన్న కింగ్‌పిన్‌ను ఏమీ చేయలేకున్నారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరులో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలను విచ్చల విడిగా సాగిస్తున్నారు. వీరి ఆటకట్టించేందుకు ఎందుకో ప్రజాహితమైన ఫిర్యాదులు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్ల డం లేదు. నేరుగా కలెక్టర్, ఆపై ఎస్పీకే ఇక్కడి అన్యాయాలను చెప్పేస్తున్నారు. వాళ్లు రంగంలోకి దిగితేతప్ప.. న్యాయం జరగదనే భావన బలంగా పాతుకుపోయింది.
అధికారమే అండగా!
అర్దగంట జీపు తీసుకుంటే చిత్తూరు నగరం మొత్తాన్ని ఓసారి చుట్టి రావొచ్చు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ శాంతి భద్రతలకు పెద్దగా విఘాతాలు కల్పించడం, ఫ్యాక్షన్ గొడవల్లాంటివి లేవనే చెప్పాలి. ఇదే సమయంలో గత కొంతకాలంగా చిత్తూరును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నిర్వహించడం, నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, ప్రైవేటు సెటిల్‌మెంట్లు, అర్ధరాత్రి గ్రానైట్ స్మగ్లింగ్, ఫేక్ కంపెనీ సిగరెట్ల విక్రయాలు, వీధి వీధిలో జరుగుతున్న గంజాయి విక్రయా లు కలవర పెడుతున్నాయి. తప్పు చేస్తున్న వారిలో ఎక్కువమంది అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి విషయాలు నాయకులకు తెలియడం లేదా..? అన్నీ వాళ్ల కనుసన్నల్లో జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారా..? ఒకవేళ వాళ్లకు సంబంధం లేకుంటే సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు..? అనే ప్రశ్నలు సామాన్యులను తొలిచేస్తున్నాయి.
ఖాకీలు గట్టిగా ఉండడంలేదా..?
చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఇదే సమయంలో తప్పు చేసిన వ్యక్తి ఖాకీలను చూస్తే మాత్రం భయపడి తీరాల్సిందే. చిత్తూరులో వన్‌టౌన్, టూటౌన్, తాలూక లాంటి ప్రధాన మూడు స్టేషన్లతో పాటు వీటిని పర్యవేక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. కానీ రహస్యమైన సమాచారం, అసాంఘిక కార్యకలాపాల వివరాలు మాత్రం స్టేషన్లకు వెళ్లడం లేదు. ఇక్కడ పనిచేసే అధికారులపై నమ్మకం లేదా..? అంటే లేకపోవడం వల్లేకదా కీలక ఫిర్యాదులు కలెక్టర్, ఎస్పీ వరకు వెళుతున్నాయనే సమాధానం వినిపిస్తోంది. తప్పుచేసిన వాళ్లు తనవాళ్లైనా వదలొద్దని ప్రజాప్రతినిధులు బహిరంగంగా చెబుతున్నా.. ఖాకీలు చర్యలకు ఉపక్రమించకపోవడం అవి వట్టి మాటలేననే సందేహం కలుగుతోంది. నేడు బాధ్యతలు చేపడుతున్న నూతన ఎస్పీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
వీటిని కాదంటారా?