
సమానత్వం దిశగా అడుగులు
తిరుపతి అర్బన్ : తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సును తిరుపతిలో నిర్వహించడం శుభసూచికమని, ఇదే స్ఫూర్తితో ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం దిశగా అడుగులు వేద్దామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. ఆదివారం తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. మూడురోజులపాటు నిర్వహించనున్న సదస్సులో ముందుగా జాతీయ, రాష్ట్ర గీతం ఆలపించి ప్రారంభించారు. పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షులు పురందేశ్వరి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ మద్దిల గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకసభ స్వీకర్ మాట్లాడుతూ భక్తి, త్యాగం, మహిళా కృషికి తిరుపతి ప్రతీకని తెలిపారు. అందుకే తొలి సమావేశానికి తిరునగరాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వికసిత్ భారత్–2047కి స్వాతంత్రం వచ్చి వందేళ్ల గడుస్తోందన్నారు. భారత్ అభివృద్ధిలో మహిళాశక్తి ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రాజసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ తిరుపతి వేదికగా మహిళా సదస్సును నిర్వహించడం విజయానికి నాందిగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూతిరుపతిలో మహిళా సాధికారత తొలి సదస్సును జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో తీసుకోనున్న తీర్మానాల అమలుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు. పురంధేశ్వరి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మహిళలకు సురక్షితత, విద్య, నైపుణ్యాలు, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చట్టసభ్యులందరినీ ఈ సదస్సు ఏకం చేస్తుందని తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం సమాన అవకాశాలు, సురక్షిత సమాజం, గౌరవమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. సాధికారత కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా మహిళా సాధికారత విధానాలు తెలుసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, సవాళ్లపై చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు మాట్లాడుతూ. తిరుపతిలో ఈ సమావేశం నిర్వహించడం చారిత్రాత్మకమైన ఘట్టమని తెలిపారు.

సమానత్వం దిశగా అడుగులు