
ఆరోపణల వెనుక కుట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా అధికారిగా పనిచేసిన రమణ పోద్బలంతో మహిళా సంఘాల సభ్యుల పేరిట భువనేశ్వరి, ఉషారాణి అనే ఇద్దరు మహిళలు తనపై నిరాధార ఆరోపణలు చేశారని చిత్తూరు నగర పాలక సంస్థ రిసోర్స్ పర్సన్ బేబీ శ్వేత ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను 38 గ్రూపులకు ఆర్పీగా పనిచేశానని, తమ గ్రూపులోని సభ్యులు ఎవరూ ఆరోపణ చేయలేదన్నారు. సభ్యులు కాని వారు ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మెప్మా అధికారి రమణ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు కక్ష సాధింపుగా ఇలా లేనిపోని ఆరోపణలను చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. తన భర్తకు ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనతో తమ పిల్లలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై
‘నిరసన వారం’
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’ కార్యక్రమాన్ని చేపడుతోందని ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ విధానాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

ఆరోపణల వెనుక కుట్ర