
ఆంక్షలు.. అడుగడుగునా ఆటంకాలు
కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు కుప్పంలో నిర్వహించిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలతోపాటు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతులు లేవని, ఆర్టీఓకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతిస్తున్నట్టు కుప్పం డీఎస్పీ పార్థసారథి సోమవారమే తేల్చారు.
భారీగా పోలీసుల మోహరింపు
అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకునేందకు ఎమ్మెల్సీ, కుప్పం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భరత్ క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మెహరించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పోలీసులు ప్యాలెస్ రోడ్డు, క్యాంపు కార్యాయలం వద్ద మోహరించారు. వైఎస్సార్ సీపీ కేడర్‌ను రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ క్యాంపు ఆఫీసు వద్ద కుప్పం అర్బన్ సీఐ, ఇద్దురు ఎస్‌ఐలు, పోలీసు యంత్రాంగం తిష్టవేసింది.
దారి పోడువునా అడ్డగింత
కుప్పం నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను దారి పోడవునా పోలీసులు అడ్డగించారు. అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అర్బన్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ హఫీజ్, మోహన్ రామ్‌ను శెట్టిపల్లి వద్ద నిలిపి వేశారు. అదేవిధంగా గుడుపల్లె మండలం, కుప్పిగానిపల్లి సర్పంచ్ రామూర్తిని వంద పడకల అస్పత్రి సర్కిల్ వద్ద నిలిపివేశారు.