
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 11 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
అంతర్జాతీయ క్రీడల్లో
విద్యార్థులు రాణించాలి
కుప్పం: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. అంతర్జాతీయ క్రీడలకు మంగళవారం ఎంపికై న విద్యార్థులను అభినందించారు. నేపాల్‌లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.
పీఈఎస్ విద్యార్థికి బహుమతి
గుడుపల్లె: మండలంలోని పీఈఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి జాహ్నవికి విశిష్ట బహుమతి లభించింది. హెల్త్ యూనివర్సిటీ 2023లో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. ఇందుకు గాను ప్రతిష్టాత్మక కవూరి హైమావతి, కవూరి చలపతిరావు బహు మతి జాహ్నవికి లభించింది. విజయవాడలో మంగళవారం నిర్వహించిన హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవంలో విద్యార్థి సాయిజాహ్నవికి బహుమతి ప్రదానం చేశారు.
టెట్‌పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీనియర్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు మరింత క్లిష్టమవుతాయన్నారు. 20 ఏళ్లకు పైగా పనిచేసిన టీచర్లు ఇప్పుడు టెట్ అర్హత సాధించడం అన్యాయమని, కష్టతరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన దసరా సెలవుల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు.
సీబీఐతో విచారణ జరిపించాలి
చిత్తూరు కార్పొరేషన్: కూటమి నాయకుల అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దోపిడీకి అడ్డులేకుండా పోతోందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆరోపించారు. పలువురు తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్రమంగా క్వారీల నిర్వహణ, గ్రావెల్, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని చెప్పారు. వీటిపై పత్రికలు, మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.