
అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏనుగులకు మేటింగ్ సీజన్
ఉద్రేకంతో రెచ్చిపోతున్న గజరాజులు
ఇప్పటికే జనంపై పలు ప్రాంతాల్లో దాడులు
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. మదపుటేనుగుల మేటింగ్ సీజన్ మొదలు
కావడంతో జనానికి ముప్పు తప్పేలాలేదు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మదమెక్కిన గజరాజులకు పట్టపగ్గాలే ఉండవు. అలవి కాని ఆగ్రహంతో రెచ్చిపోయే భీ‘కరి’ నుంచి తోటి జంతువులతోపాటు మనుషులకు కూడా ముప్పు పొంచి ఉంటుంది. మేటింగ్ సీజన్ ముగిసే వరకు అటవీ సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎలిఫెంట్ శాంచురీని దాటి బయటకొచ్చే మదపుటేనుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పలమనేరు : రాష్ట్రంలోని కుప్పం, చిత్తూరు, పలమనేరు ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, కృష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హోసూర్, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు (మదపుటేనుగులు) మాత్రం ఉన్నాయి. గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది.
ఇవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. జనం కనిపిస్తే దాడులు చేస్తుంటాయి. వీటి చేష్టలు, గుర్తులను బట్టి స్థానికంగా వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో రౌడీ ఏనుగు, రాముడు, భీముడు, ఒంటి దంతం ఏనుగు, ఒంటికన్ను ఏనుగు ఇలా వీటికి పేర్లు పెట్టారు. ఇవి తమ ఉనికి కోసం రౌడీల్లా ప్రవర్తిస్తుంటాయి. మిగిలిన ఆడ ఏనుగులు, గున్నలకు భయమెక్కువ, దీంతో ఇవి గుంపులోనే ఉంటూ జనాన్ని చూసి వెనక్కు వెళుతుంటాయి. కానీమదపుటేనుగులు ఏమాత్రం భయపడవు, ఎదురు దాడులకు దిగుతుంటాయి.
ప్రస్తుతం ఆరు మాత్రమే..
కౌండిన్యలోని 12 మదపుటేనుగుల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే ఉన్నాయి. బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లెలో రౌడీ ఏనుగుగా చెప్పుకునే మదపుటేనుగు కరెంటు తీగలకు బలైంది. గంగవరం మండలం మన్నారునాయనిపల్లె సమీపంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. అంతకుముందు కాలువపల్లె, మొసలి మడుగు వద్ద రాముడు, భీముడు అనే రెండు మదపుటేనుగులు చనిపోయాయి.
మూడేళ్ల క్రితం పలమనేరు మండలంలోని బేరుపల్లె, గాంధీనగర్‌ల వద్ద రెండు మదపుటేనుగులు కరెంట్ షాక్‌తో కన్నుమూశాయి. ఇవి బతికున్నప్పుడు మనుషులు, పశువులు, కుక్కలను తరమి తరిమి చంపేవి. ఇప్పుడున్న ఆరు మదపుటేనుగుల్లో గుడ్డి కన్ను ఏనుగు గత మేటింగ్ సీజన్‌లో యాదమరి మండలం దిగువకనతల చెరవువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను చంపిన విషయం తెలిసిందే.
మొసలిమడుగు రౌడీగా పిలవబడే మరో ఏనుగు కౌండిన్యలోని వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసిరేసింది. ఊసరపెంట మదపుటేనుగు తరచూ ఆ గ్రామంలోకి వచ్చి రాత్రంతా ఉండి వెళ్లడం దీని ప్రత్యేకత. మిగిలిన రెండు మదపుటేనుగులు వేర్వేరుగా కౌండిన్యలో సంబంధిత
ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి.
ఈ నాలుగు నెలలు ప్రమాదమే..
ముఖ్యంగా మదపుటేనుగులు అక్టోబరు నుంచి జనవరి వరకు ఆడ ఏనుగుల సాంగత్యం కోసం మత్తులో ఉంటాయి (మేటింగ్ సీజన్). దీంతో తిక్కతిక్కగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే ఆగ్రహంతో ఊగిపోతుంటాయి. తన పరిధితోపాటు అడవిలో ఆడ ఏనుగుల కోసం చాలాదూరం అన్వేషిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ సమయంలో మనషులు, జంతువులపై దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆడ ఏనుగులు వీటి మాట వినకపోవడం లేదా అక్కడ జరిగే రభసతో ఇప్పటిదాకా ఆరు ఆడ ఏనుగులు మృతిచెందాయి. ఏదేమైనా ఈ నాలుగునెలలు మదపుటేనుగుల కారణంగా ప్రమాదాలు పొంచిఉన్నాయి. కాబట్టి అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
ఆగ్రహంతో ఊగిపోతూ...
మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి పైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి. ఆడ ఏనుగులుకున్నంత సహనం వీటికి ఉండదు. ఇప్పటిదాకా పరిశీలిస్తే యాదమరి మండలం దిగువకనతల చెరువువద్ద అటవీశాఖ డ్రైవర్ సతీష్ ను, వీరమానికుంటవద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆపై ముగ్గురు ఎలిఫెంట్ ట్రాకర్స్‌ను తొండంతో విసరడం, పందేరుపల్లి వద్ద రైతును, కాలువపల్లి వద్ద యువకుడిని తొండంతో కొట్టి చంపడం చేసింది మదపుటేనుగులే. పెద్దపంజాణిమండలం పెనుగొలకలకు చెందిన బంగారప్పను, కాలువపల్లి వద్ద రైతు సుబ్రమణ్యను చంపింది మదపుటేనుగులే. కుప్పంలోనూ దాడులు చేసింది ఇవే. పదిరోజుల క్రితం పెద్దపంజాణి మండలంలో రైతును తొక్కి చంపిందే మదపుటేనుగే. గుడిపాల మండలంలో దంపతులను చంపిందే మదపుటేనుగే.
మదపుటేనుగులకు కోపం ఎక్కువ
గుంపులనుంచి వేరుగా ఉంటూ ఒంటరిగా సంచరించే మదపుటేనుగులు చాలా కోపంగా ఉంటాయి. వీటి బారినుంచి తప్పించుకోవాలంటే ఏనుగు తరిమినప్పుడు మనిషి నేరుగా కా కుండా ఎస్ ఆకారంలో వెళ్లాలి. ఒంటిపై ఉన్న బ ట్టలను తీసి ఏనుగు ముందు వేస్తే అది కాసేపు దాన్ని వాసన చూస్తు తొక్కుతుండగా ఆ గ్యాప్‌లో తప్పించునే అవకాశముంటుంది. మేటింగ్ సీజన్‌లో మరింత ఆగ్రహంగా ఉంటాయి. కాబట్టి అ టవీ సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – భరణి, డీఎఫ్‌ఆర్‌ఓ, చిత్తూరు
కౌండిన్య పరిధిలోనిమొత్తం ఏనుగులు : సుమారు 100
ఇప్పటి వరకు గజ దాడుల్లో మృతుల సంఖ్య : 15
గాయపడినవారు : 36
ఇప్పటిదాకా మృతి చెందినఏనుగుల సంఖ్య : 19