
క్రికెట్ ఆడడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
నగరి : సెలవు రోజున క్రికెట్ ఆడడానికి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేటలోని నేత కుటుంబంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నేత కార్మికుడు ఆరుముగం కుమారుడు యువరాజ్ (14) నగరి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గుండ్రాజుకుప్పం దళితవాడ సమీపంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ఆట ముగిసిన సమయంలో మైదానానికి పక్కనే ఉన్న చెరువులో నీటిని చూసి అందులో ఈతకు దిగాడు. ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. కాగా ఆరుముగంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు యువరాజ్ ఒక్కడే కావడంతో ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
75 బస్తాల బియ్యం స్వాధీనం
వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. అక్రమ రవాణా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఏపీ 39 డబ్ల్యూడీ 5318 నెంబరు గల బొలేరో లగేజ్ వెహికల్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ.1.35 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
8న ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 8వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, డీ, బీ, ఎం, ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 95338 89902, 79898 10194 సంప్రదించాలని సూచించారు.

క్రికెట్ ఆడడానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు