
సమస్యలు పరిష్కరించండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. తిరుగుతూనే ఉన్నాం.. సమస్యలు పరిష్కరించండి’ అంటూ వివిధ ప్రాంతాల అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి క్యూ కట్టారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 297 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్‌డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కుసుమకుమారి పాల్గొన్నారు.
పశువైద్య సేవలు అందడం లేదు
తమ గ్రామంలో పశువైద్య సేవలు సరిగా అందడం లేదంటూ పెనుమూరు మండలం గంగుపల్లికి చెందిన తులసీరాం, గీత వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని పశుసంవర్థక సహాయకులు సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. జబ్బుపడిన మూగజీవాలకు వైద్యం చేయకపోవడంతో మృతిచెందుతున్నాయన్నారు.
శ్మశాన దారిని బాగు చేయించండి
శ్మశాన వాటిక దారి సమస్య పరిష్కరించడయ్యా అంటూ చిత్తూరు మండలం పంట్రాంపల్లి గ్రామస్తులు త్యాగరాజరెడ్డి, భాగ్యవతి అధికారులను వేడుకున్నారు. తమ గ్రామంలోని శ్మశానవాటికకు వెళ్లే దారి గుంతలమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. అంతిమ సంస్కారాలు చేసేందుకు వెళ్లే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దారిని శుభ్రం చేయించి రోడ్డు వేయించాలని కోరారు.
ఆక్రమించుకున్నారు
తన భూ సమస్య కోర్టులో జరుగుతుండగా కొందరు ఆక్రమించుకున్నారని పెనుమూరు మండలం, కలిగిరికి చెందిన సుబ్రహ్మణ్యం వాపోయారు. తమ గ్రామ పరిధిలో సర్వే నం.10/1లోని భూ సమస్య కోర్టులో కొనసాగుతోందన్నారు. ఇంతలోపు తన భూమిని ఆక్రమించుకుని భయాందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు తన భూమి దురాక్రమణకు గురికాకుండా న్యాయం చేయాలని అధికారులను కోరారు.
వైకల్య పరీక్షలు చేయమంటున్నారు
వైద్యాధికారులు వైకల్యం పున:పరిశీలన పరీక్షలు చేయమని ఇబ్బందులు పెడుతున్నారని చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసాపల్లికి చెందిన అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దివ్యాంగుడైన తన కుమారుడు శివకుమార్‌తో కలిసి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడు శివకుమార్ నడవలేడని, మాట్లాడలేడని వాపోయారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ పింఛన్ తొలగించారని కన్నీరు మున్నీరయ్యారు. వైద్యపరీక్షలు పున:పరిశీలన చేయించుకోవాలని నోటీసు ఇచ్చారన్నారు. అక్కడకి వెళ్తే వైద్యాధికారులు పరీక్షలు చేసేందుకు కుదరదని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పరిశీలించి తన కుమారుడికి తొలగించిన రూ.15 వేల పింఛన్ ఇప్పించాలని కోరారు.