
జాలి చూపించారు!
బంగారుపాళ్యం/కాణిపాకం: పుట్టకతోనే పక్షవాతానికి గురైన ఓ యువకుడికి అడ్డగోలుగా పింఛన్ తొలగించారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. గత నెల 17వ తేదీన ‘నన్ను చూస్తే జాలి లేదా?’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై అధికారులు స్పందించారు. ఎట్టకేలకు పింఛన్‌ను పునరుద్ధరించారు. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతుల పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. అతన్ని రక్షించేందుకు తల్లిదండ్రులు ఉన్నదంతా ధారబోశారు. అయినా కొడుకు కోలుకోలేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే నెట్టుకొస్తున్నారు. అయితే ఇటీవల రీ వెరిఫికేషన్ పేరుతో ఆ యువకుడిని పింఛన్‌కు అనర్హుడిగా తేల్చారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది నోటీసులు కూడా జారీచేశారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. పునఃపరిశీలన చేసి ఆ యువకుడికి పింఛన్ వచ్చేలా చేశారు. మూడు రోజుల క్రితం సీఎంఓ ఆఫీసు నుంచి ఫోన్ చేసి మళ్లీ మీకు రూ.15వేల పింఛన్ వచ్చేలా చేశామని వివరించారు. ఈ క్రమంలోనే సోమవారం పింఛన్ సొమ్మును అందకుని బాధిత తల్లిదండ్రులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.