ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్‌

Jul 15 2025 6:59 AM | Updated on Jul 15 2025 6:59 AM

ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్‌

ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్‌

● కత్తులు, వైర్‌కట్టర్లు స్వాధీనం

చిత్తూరు కార్పొరేషన్‌: రైళ్లలో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను రైల్వే గుంతకల్లు ఎస్పీ రాహుల్‌మీనా, తిరుపతి డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో రేణిగుంటలో చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా, ఖడ్కి గ్రామానికి చెందిన జలిందర్‌ మహిర్యా పవార్‌(50), కోహినూర్‌ నవనత్‌ పవార్‌(24) రైళ్లలో దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. అనంతరం వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్‌కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు ఎక్కువగా వేకువజామున 2–4 గంటల మధ్యలో నిర్మానుష ప్రాంతాల్లో సిగ్నల్‌బాక్స్‌లోని వైర్లను కట్‌ చేసి రైలు ఆగిపోయేలా చేసేవారని, ఆ తర్వాత కోచ్‌లో కిటికీ పక్కన ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు చైన్స్‌, విలువైన వస్తువులు దోచుకునేవారన్నారు. కొన్ని సందర్భాల్లో కత్తులతో ప్రయాణికులను బెదిరించారని చెప్పారు.

వరుస దొంగతనాలు

గత నెల 26న సిద్ధంపల్లె రైల్వే స్టేషన్‌ సమీపంలో చామరాజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణిస్తుండగా సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైలును అపారన్నారు. నలుగురు మహిళలను కత్తులతో బెదిరించి 85 గ్రాముల బంగారు గొలుసులు లాక్కున్నారని తెలిపారు. వీటిపై డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో సీఐలు యత్రీంద, సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌, రవి, ధర్మేంద్రరాజు, గోపాల్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించి వీరి కోసం మహారాష్ట్రలోని సోలాపూర్‌, పూణేలోని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేసినట్టు తెలిపారు. అక్కడ దొరికిన సమాచారం మేరకు జూలై 13న నిందితులను రేణిగుంటలో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మే 2న మామండూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో సోలాపూర్‌ స్పెషల్‌రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 35 గ్రామలు దోచుకోగా.., అదేనెల 12న పూతలపట్టు వద్ద ఆగి ఉన్న రైలు చివరిబోగిలో ఉన్న వ్యక్తి నుంచి దొంగతనానికి యత్నించి తప్పించుకున్నట్టు వెల్లడించారు. 14న ముంగిలిపట్టు రైల్వేస్టేషన్‌లో తిరుపతి–విల్లుపురం రైలులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద 24 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించగా.., 21న మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. జూన్‌ 2న ముంగిలిపట్టు స్టేషన్‌లో చామరాజనగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు మహిళల నుంచి 60 గ్రాములు దోచుకున్నట్టు పేర్కొన్నారు. జూన్‌ 5న మానవపాడు, 13న అల్లంపూర్‌ రైల్వేస్టేషన్లలో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. 24న తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో కిటికీ పక్కన ఉన్న ప్రయాణికురాల నుంచి 27 గ్రాములు దోచుకున్నట్టు వెల్లడించారు.

రికవరీ శూన్యం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా ఈ ముఠా 9 దొంగతనాలకు పాల్పడింది. ఇందులో మొత్తం 242 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. వీరిని పట్టుకోవడానికి 40 మందితో కూడిన రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అక్కడ లభించిన సమాచారం మేరకు రేణిగుంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్‌కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక్క గ్రాము బంగారం కూడా వారి వద్ద రాబట్టలేకపోయారు. కేసు దర్యాప్తునకు సహకరించిన చిత్తూరు ఎస్పీ మణికంఠచందోలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక బృందం సభ్యులకు అభినందన పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement