
భక్తులతో కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో మంగళవారం కిక్కిరిసింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు పిండి, నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.
యువతిపై అడవి పంది దాడి
కుప్పం రూరల్ : మండలంలోని వి.మిట్టపల్లెలో మంగళవారం ఉదయం అడవి పంది దాడిలో ఓ యువతి గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన దండపాణి కుమార్తె మీనాక్షి పశువులకు గడ్డి తెచ్చేందుకు పాలానికి వెళ్లింది. ఇంతలో కుక్కలు తరమడంతో అటు వైపు వచ్చిన అడవి పంది దాడి చేసి మీనాక్షి కాలిని గట్టిగా కరిచేసింది. యువతి భయంతో కేకలు వేయడంతో సమీపంలోని కుటుంబీకులు హుటాహుటి వచ్చి పందిని తరిమేశారు. గాయపడిన మీనాక్షిని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ అడవి పందుల కారణంగా పంటలు నాశనమవుతున్నాయని, పలువురు గాయపడుతున్నారని తెలిపారు. అటవీ అధికారులు స్పందించి అడవి పందులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వి.కోట: భార్యతో గొడవపడి మనస్తాపంతో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. మండలంలోని యాలకల్లు పంచాయతీ, కపట్లబండకు చెందిన వెంకటరమణప్ప కుమారుడు సుబ్రమణ్యం(37) తన భార్యపిల్లలతో కలిసి మండలంలోని గెస్తింపల్లి సమీపంలోని ప్రజాష్‌స్వామికి చెందిన మామిడి తోటలో కొంతకాలంగా కాపలాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య భర్తలిద్దరూ గొడవపడ్డాడు. మంగళవారం ఉదయం భార్య తోట నుంచి బయటకు వెళ్లగానే సుబ్రమణ్యం అదే తోటలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ