
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
శాంతిపురం: తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్లగట్ట పంచాయతీలోని తంబిగానిపల్లికి చెందిన ఎం.ఎల్లప్ప గురువారం కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. తనకు మంచి పదవి ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు తమ పంచాయతీలోని టీడీపీ నాయకులు పార్టీలోకి చేర్చుకున్నారని ఎల్లప్ప చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం తిప్పుకోవడంతోపాటు భారీగా ఖర్చులు పెట్టించారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా తనకు పదవి ఇవ్వలేదన్నారు. పదవి ఇవ్వాలని, పక్కా ఇల్లు ఇవ్వాలని పదే పదే అడిగితే తనను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి తనను వాడుకుని మోసం చేశారని అర్థం కావడంతో తాను ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా పాలన సాగించి, మాట తప్పని నేతగా నిలిచిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కర్లగట్ట ఎంపీటీసీ సభ్యుడు చలం, నాయకులు శ్రీనివాసులు, వెంరటముని తదితరులు పాల్గొన్నారు.