
హెచ్‌ఎం కేడర్ బదిలీలకు 210 దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రధానోపాధ్యాయుల కేడర్ బదిలీలకు 210 దరఖాస్తులు అందాయి. అందులో రెండు దరఖాస్తులను వివిధ కారణాలతో విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు. మిగిలిన 208 దరఖాస్తులను ఆమోదించారు. హెచ్‌ఎం కేడర్‌లో 181 ఖాళీలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జెడ్పీ కింద 155, ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో 10, మున్సిపల్ కార్పొరేషన్‌లో 9, మున్సిపాలిటీల్లో 7 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసిన ఖాళీల ఆధారంగా హెచ్‌ఎంలు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బదిలీల ఉత్తర్వులను ఆన్‌లైన్‌లోనే జారీచేయనున్నారు.
నేడు ఉద్యోగోన్నతులకు పరిశీలన
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్‌లకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం మంగళవారం ఉద్యోగోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్‌లు పరిశీలించనున్నారు. చిత్తూరులోని లిటిల్ ప్లవర్ ఎయిడెడ్ పాఠశాలలో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. గ్రేడ్ 2 హెచ్‌ఎం పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సర్టిఫికెట్‌లతో హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సీనియారిటీ జాబితాను డీఈఓ వెబ్‌సైట్, డీవైఈఓ, ఎంఈఓలకు పంపినట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు.
గొప్పలు చెప్పుకుని.. గుట్టుగా జారుకుని!
చిత్తూరు కలెక్టరేట్ : చేసిందేమీ లేకపోయినా...గొప్పలు చెప్పుకునేందుకే మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి జిల్లా పర్యటనకు విచ్చేశారని పలువురు విమర్శలు గుప్పించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సాంఘిక సంక్షేమ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా దళితులకు కూటమి ప్రభుత్వం ఏదో చేసేసినట్లు ఊదరగొట్టారు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనప్పటికీ రూ.కోట్లు విడుదల చేసి దళితులకు మేలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొంది మాదిగ, మాలలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో 954, తిరుపతి జిల్లాలో 1,267 యూనిట్‌లకు ప్రభుత్వం రూ.92 కోట్లు మంజూరు చేసిందని గొప్పలు చెప్పారు. అయితే రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే మాత్రం నీళ్లు నమిలారు. ఇంతకీ రుణాలు ఎప్పుడిస్తారు అంటే సమాధానం చెప్పకుండా జారుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.