
చెక్‌డ్యాంకు గండికొట్టిన ఘనుడు
● నీళ్లు వృథాగా పోతున్నాయని రైతుల ఆవేదన
పలమనేరు : కౌండిన్య నదిలో నిర్మించిన చెక్‌డ్యాం కారణంగా తన పొలంలో ఎక్కువగా నీరు నిలుస్తోందని ఓ రైతు ఏకంగా చెక్‌డ్యాంకే గండికొట్టిన సంఘటన మండలంలోని మొరం పంచాయతీలో మంగళవారం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్యలోని పలు చెక్‌డ్యామ్‌ల్లో నీరు చేరింది. అయితే ఈ నీటినిల్వతో తన పొలంలో నీటి ఊట వస్తోందని తొప్పనపల్లికి చెందిన బాబు అనే వ్యక్తి చెక్‌డ్యామ్ కింద గండిని కొట్టాడు. దీంతో నీరు వృథాగా పోవడంపై అక్కడి రైతులు అతన్ని వారించినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక సర్పంచ్ విశ్వనాథ రెడ్డి ద్వారా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన స్థానిక ఇరిగేషన్ డీఈ చోక్లానాయక్ తమ సిబ్బందితో కలిసి గండి పడిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించి ఇసుక బస్తాలతో నింపాలని అక్కడి రైతులకు సూచించారు. ఇందుకు కారణమైన వ్యక్తిని పిలిపించి వారించగా అతను తాను టీడీపీకి చెందిన వాన్నని ఏమైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని చెప్పడంతో డీఈ సైతం వెనుదిరగాల్సి వచ్చింది.