
డీడీపై కలెక్టర్‌కు ఫిర్యాదు
● కలెక్టరేట్ వద్ద డీఎస్సీ అభ్యర్థుల నిరసన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య దురుసు వ్యవహార శైలిపై కుట్టి శిక్షణ కేంద్రం డీఎస్సీ అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి ఆవేదనను చెప్పుకున్నారు. శిక్షణ కేంద్రంపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవుతున్న సమయంలో తమ ఏకాగ్రత దెబ్బతినేలా అధికారి వ్యవహరించడం ఎంత వరకు న్యాయమన్నారు. నిరసన కార్యక్రమంలో కుట్టి శిక్షణ కేంద్రం డైరెక్టర్ పవనకుమారి, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఉద్యోగోన్నతుల సర్టిఫికెట్ల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : గ్రేడ్–2 హెచ్‌ఎం ఉద్యోగోన్నతుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ ఎయిడెడ్ పాఠశాలలో పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 150 ఖాళీలకు గ్రేడ్–2 హెచ్‌ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వర రావు పరిశీలించారు.
సెలవులో జాయింట్ కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : వ్యక్తిగత పనుల నిమిత్తం జాయింట్ కలెక్టర్ విద్యాధరి సెలవుపై వెళ్లారు. 27 నుంచి 29 వ తేదీ వరకు అందుబాటులో ఉండరు. జేసీగా కలెక్టరే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. తిరిగి 30న జేసీ వీధులకు హాజరవుతారు.
చోరీ కేసులో నిందితుడికి జైలు
చిత్తూరు అర్బన్ : ఆలయంలో హుండీ పగులగొట్టి చోరీ చేసిన ఘటనలో రామ్మోహన్ (35) అనే నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి డి.ఉమాదేవి కథనం మేరకు... బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె పంచాయతీ పాపుదేసివారికండిగ గ్రామంలోని వినాయకస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు 2023 మార్చి 31న రాత్రి ఆలయ హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న రూ.2 వేలు అపహరించుకుని వెళ్లారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనిఖీ చేపట్టి నిందితుడు అనంతపురం జిల్లా కదిరికి చెందిన రామ్మోహన్ (35)గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ విషయం వెలుగులోకి రావడంతో నిందితుడిపై బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.