డబుల్‌ మేజర్‌.. | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ మేజర్‌..

May 28 2025 12:33 AM | Updated on May 28 2025 12:33 AM

డబుల్

డబుల్‌ మేజర్‌..

ఈ ఏడాది నుంచి డిగ్రీలో డబుల్‌ మేజర్‌ సబ్జెక్టులు
● కరిక్యులమ్‌ రూపకల్పన పూర్తి చేసిన ప్రొఫెసర్‌ వెంకయ్య కమిటీ ● వీసీలు, నిపుణులతో చర్చించి నిర్ణయించిన ఉన్నత విద్యామండలి ● ఏఐ, మిషన్‌లర్నింగ్‌ కోర్సులతో సరికొత్త డిగ్రీలు ● అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల సంగతేమిటో? ● జిల్లాలో ఓఏఎమ్‌డీసీ నోటిఫికేషన్‌ కోసం 30 వేల మంది ఎదురుచూపు

తిరుపతి సిటీ: విద్యారంగంలో నూతన సంస్కరణల్లో భాగంగా డిగ్రీలో ఈ ఏడాది నుంచి డబుల్‌ మేజర్‌ సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. ఇదివరకు ఉన్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టుతో పాటు మరో మేజర్‌ సబ్జెక్ట్‌ను విద్యార్థులు అభ్యసించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కరిక్యులమ్‌ రూపకల్పన కోసం నియమించిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకయ్య కమిటీ నివేదిక సమర్పించింది. ఈ ఏడాది విడుదలయే ఓఎమ్‌డీసీ నోటిఫికేషన్‌లో డబుల్‌ మేజర్‌ సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని వర్సిటీల వీసీలతో, నిపుణులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న మల్టీడిసిప్లీనరీ విధానంలో మూడు సబ్జెక్టులు మేజర్‌గా ఉండేవి. 2023–24లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ పూర్తిచేసే అవకాశం కల్పించారు. ఇప్పడు రెండు మేజర్‌ సబ్జెక్ట్‌లను విద్యార్థి చదవాల్సిందేనంటూ సరికొత్త విధానాన్ని అములు చేయబోతున్నారు.

ఏఐ, మిషన్‌లర్నింగ్‌ కోర్సులతో సరికొత్త డిగ్రీలు

డబుల్‌ మేజర్‌ సబ్జెక్‌ విధానంలో డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. మేజర్‌ సబ్జెక్టులకు అనుసంధానంగా మైనర్‌ సబ్జెక్టులుగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ సబ్జెక్టులను చేర్చేందుకు కసరత్తు పూర్తిచేశారు. దీంతో బీటెక్‌ సాంకేతిక విద్యనభ్యసించే వారికి మాత్రమే అందుబాటులో ఉండే ఈ సబ్జెక్ట్‌లను డిగ్రీ చదివే విద్యార్థులు మైనర్‌ సబ్జెక్ట్‌లుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండనుంది.

ఎదురుచూపులు

ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలై సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిగ్రి ప్రవేశాల కోసం వెలువడే ఓఏఎమ్‌డీసీ (ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ టు డిగ్రీ కాలేజస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. నోటిఫికేషన్‌ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కానీ డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ అంటూ విద్యార్థులను కన్‌ఫ్యూజన్‌లోకి నెడుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో పలువురు విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలో ఇంజినీరీంగ్‌, పలు కంప్యూటర్‌ డిగ్రీ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.

డబుల్‌ మేజర్‌ అంటే..

డబుల్‌ మేజర్‌ సబ్జెక్టులు అంటే డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన మేజర్‌ సబ్జెక్ట్‌కు 48 క్రెడిట్లు, రెండో మేజర్‌ సబ్జెక్ట్‌కు 32 కెడ్రిట్లు ఇవ్వనున్నారు. ఎంపిక చేసుకున్న మేజర్‌ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకదానిలో పీజీ చేసుకునే అవకాశం ఉంటుంది. మరో మైనర్‌ సబ్జెక్ట్‌గా విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు బీఎస్సీ ఎంపీసీలో విద్యార్థి తనకు నచ్చిన మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ను రెండు మేజర్‌ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకోవచ్చు. మూడవ సబ్జెక్ట్‌గా ఏదేని మైనర్‌ సబ్జెక్ట్‌ను ఎంపికచేసుకుని అభ్యసించవచ్చు. నూతన విద్యా విధానంలో భాగంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ప్రస్తుతం అమలులో ఉంది. కానీ విద్యార్థులు మూడేళ్ల డిగ్రీపైనే మొగ్గు చూపుతున్నారు.

ఉపాధి అవకాశాలు మెండు

ఉన్నత విద్యామండలి ఈ ఏడాది నుంచి డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లను డిగ్రీలో ప్రవేశపెట్టడం ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి రెండు మేజర్‌ సబ్జెక్టులలో పట్టు సాఽధించి ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు. ఇప్పటికే అందిరి వీసీలు, విద్యారంగ నిపుణులతో చర్చించి నిర్ణయించారు. ప్రొఫెసర్‌ వెంకయ్య కమిటీ కరిక్యులమ్‌ రూపకల్పన పూర్తి చేసిందని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఓఏఎమ్‌డీసీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదలవుతుంది.

–సీహెచ్‌.అప్పారావు, వీసీ, ఎస్వీయూ

అధ్యాపకుల కొరత మాటేమిటో?

ప్రభుత్వం డిగ్రీ విద్య విషయంలో గందరగోళం సృష్టిస్తోంది. డబుల్‌ మేజర్‌ సబ్జెక్టులను ప్రవేశపెడుతూ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి అసలు విషయం బోధన సిబ్బంది కొరతపై ఆలోచించకపోవడం గమనార్హం. అన్ని ఉన్నా.. అల్లుడునోట్లో శని అనే చందంగా తయారైంది కూటమి ప్రభుత్వ పాలన. డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు, ల్యాబ్‌ సౌకర్యాలు, అధ్యాపకుల కొరతతో జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే పలు కళాశాలల్లో మేజర్‌ సబ్జెక్టులకు శాశ్వత అధ్యాపకులు కొరతతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా డబుల్‌ మేజర్‌ అంటూ ఊదరగొడితే నష్టపోయేది విద్యార్థులే.

డబుల్‌ మేజర్‌..1
1/2

డబుల్‌ మేజర్‌..

డబుల్‌ మేజర్‌..2
2/2

డబుల్‌ మేజర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement