
క్వారీపై కన్ను
● అడ్డుకున్న గ్రామస్తులు
హిటాచీని అడ్డుకున్న రెండు పంచాయతీ ప్రజలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఐరాల మండలంలోని మఠంపల్లెలో వెలసిన శ్రీ వీరభధ్ర స్వామి ఆలయానికి అనుసంధానమైన దేవుని నల్లగుట్టలోని క్వారీపై పచ్చనేతల కన్ను పడింది. నల్లగుట్ట కింద సొరంగంలో దేవుడి రాతి విగ్రహాలు ఉన్నాయి. ఏటా కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తారు. దీంతో పాటు పొడి స్తంభంపై కార్తీక మాసంలో అఖండ జ్యోతిని ఆనవాయితీగా వెలిగిస్తున్నారు. పురాతన ఆలయం కావడంతో ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ క్రమంలో పచ్చ నేతలు ఈ దేవుని నల్లగుట్టపై క్వారీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం ఉదయం లారీలో హిటాచీని తీసుకుని మాదిగపల్లె మార్గం గుండా రిజ్వర్ ఫారెస్ట్‌లోకి వెళుతుండగా స్థానికులు గమనించి స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీపీ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు, రెండు పంచాయతీల గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. వారందరూ దేవుని నల్లగుట్ట వద్దకు చేరుకొని హిటాచీ డ్రైవర్‌ను నిలదీశారు. దీంతో డ్రైవర్ మా ఓనర్ పంపితేనే ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చాడు. దీంతో సర్పంచ్, ఎంపీపీ హిటాచీ యజమానికి ఫోన్ చేసి ప్రశ్నించగా ఎమ్మెల్యే, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు గిరిధర్‌బాబు, పాతపాళ్యం సర్పంచ్ లోకేష్ చెప్పితేనే హిటాచి పంపించామని బదులిచ్చారు. దీంతో వారు స్పందిస్తూ పురాతన ఆలయానికి సంబంధించిన ఈ గుట్టపై ఎవరైనా క్వారీ పనులు చేపడితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో డ్రైవర్ హిటాచీని గుట్ట కింద వదిలి వెళ్లిపోయాడు. ఈ విషయంపై శనివారం తహసీల్దార్, ఎస్‌ఐకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై తహసీల్దార్ మహేష్‌కుమార్‌ను వివరణ కోరగా వీఆర్‌ఓను నల్లగుట్ట వద్దకు పంపించామన్నారు.
రిజ్వర్ ఫారెస్ట్‌లోకి అనుమతి తప్పనిసరి
అటవీశాఖకు సంబంధించిన రిజ్వర్ ఫారెస్ట్‌లోకి ఎలాంటి వాహనాలకై నా అనుమతులు తప్పనిసరిని స్థానిక అటవీశాఖ అధికారి రాకేష్‌కుమార్ తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దేవుని నల్లగుట్ట

క్వారీపై కన్ను