
23 రోజులు.. 1000 రిజిస్ట్రేషన్లు
● రేషన్‌కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ తిప్పలు ● అవసరం లేదని ప్రకటించిన అధికారులు ● అవగాహన లేక పెరుగుతున్న రద్దీ ● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీ
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌తో పాటు వివాహ ధ్రువపత్రం జతచేసి సచివాలయాల్లో అందజేయాలని తొలుత ప్రభుత్వం నిబంధన విధించింది. తర్వాత వీటిపై అభ్యంతరాలు రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పెళ్లికార్డు ఉంటేనే వివాహ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తారు. దరఖాస్తుకు జత చేసేందుకు మళ్లీ శుభలేఖలను ప్రింటింగ్ చేయించుకుంటున్నారు. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు ఫారానికి భార్యాభర్తల ఆధార్ కార్డు, శుభలేఖ, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రశీదు, ఆలయాల్లో జరిగితే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రం, రూ.500 చలానా జత చేసి సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు ఇవ్వాలి. అన్నీ సవ్యంగా ఉంటే గంట వ్యవధిలో వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ అన్నీ ఉన్నా ఏదో ఒక సాకుతో రిజెక్టు చేస్తున్నారు. అదే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లి అడిగినంత ఇస్తే గంటలో పనిచేస్తున్నారనే వాదన ఉంది.
అన్నా ఇది సీజన్... ఎంత సేపు మీ (డాక్యుమెంట్ రైటర్లు) సంపాదననే మా గురించి పట్టించుకోండి.. లేదా ఇదేమన్నా అత్తారిళ్లా వచ్చి పనులు చేసుకోనిపోవడానికి అని ఇటీవల జిల్లాలోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులు అన్న మాటలు.. ఇవే వారి పనితీరుకు తార్కాణం.
వివాహ రిజిస్ట్రేషన్ వద్దని ప్రకటన
రేషన్‌కాార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వీటిపై పెద్దగా క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడం, భవిష్యత్తులో పథకాలకు పనికి వస్తుందని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మొత్తం 478 వివాహ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కానీ మే నెలలో 23 రోజులకు 1005 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇందులో ఎక్కువగా చిత్తూరు అర్బన్, రూరల్ కార్యాలయాల నందు జరుగుతున్నాయి. తక్కువ వివాహ రిజిస్ట్రేషన్స్ జరిగే కార్వేటినగరం, బంగారుపాళ్యం, కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరులోనూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్లు
జిల్లాలో 19 వేల మంది పైగా రేషన్ కార్డులో చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ కరెక్షన్, సభ్యుల చేర్పు, సభ్యుల తొలగింపు, కొత్తరేషన్ కార్డు, కార్డు విభజన కోసం , రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహం జరిగిన వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వారు అన్ని వివరాలను పరిశీలించి అక్కడే ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. గడువు దాటిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే పొందాల్సి ఉంటుంది. ఫొటోలు, ధ్రువీకరణ పత్రాల నకళ్లు, పురోహితుడి ధ్రువీకరణ, చలానా చెల్లింపు ఇలా మొత్తంగా రూ.1000 వరకు ఖర్చువుతోంది. అదనంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రైటర్లు రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.
ముస్లిం, క్రైస్తవులకు తిప్పలు
ముస్లిం, క్రైస్తవులు వివాహ ఽధ్రువీకరణ పత్రం పొందాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుంది. వివాహ పత్రానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు నోటీసు బోర్డులో 30 రోజులు ఉంచుతారు. దీని పై అభ్యంతరాలు రాకుంటే అప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. కానీ కొత్త కార్డులకు దరఖాస్తు గడువు జూన్ 7 వరకు మాత్రమే ఉండటతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.. కానీ సమయం పొడిగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
వివాహ రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుదారులకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పలు అంశాలకు రిజిస్ట్రేషన్ ప్రయోజనకరమని చేసుకుంటున్నారు అది మంచిదే. వేలకు వేలు అడిగితే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకుంటాం.
– రమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్
అవసరాన్ని ఆసరాగా చేసుకొని..
నగరానికి చెందిన శోభన్, సుమిత్రలకు వివాహమై సంవత్సరం అయింది. రేషన్ కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ అవసరం లేదనే అంశంపై ప్రచారం లేకపోవడంతో వివాహ రిజిస్ట్రేషన్ కో సం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించారు. అది లేదు, ఇది సరిగ్గా లేదు, ఆ పత్రం కావాలి అంటూ సవాలక్ష ప్రశ్నలను అధికారుల వేశారు. దీంతో గత్యంతరం లేక డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించగా రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంతా ఎందుకంటే స్లాట్ బుకింగ్‌కే రూ. 500, అధికారికి రూ.2000 వరకు, డాక్యుమెంట్ స్కానింగ్, నెట్, ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని అంత అవుతుందన్నారు. అతడితో బేరం ఆడి రూ.4 వేలు ఇచ్చారు. వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రం చేతిలో పెట్టారు.

23 రోజులు.. 1000 రిజిస్ట్రేషన్లు