అరటి సాగులో అద్భుతాలు
గ్రూపు –1లో తప్పినా.. సాగులో సక్సెస్
● తండ్రికి అండగా నిలవాలని నిర్ణయం ● అరటి సాగు చేపట్టి అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు
కుప్పంరూరల్: గ్రూప్–1లో తప్పినా.. సాగులో సక్సెస్ అయ్యాడు కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జ్ఞానప్రకాష్. అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తండ్రికి తోడూనీడగా ఉంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
మొదటి ప్రయత్నంలోనే సక్సెస్
కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన జ్ఞానప్రకాశ్ బీ.ఏ వరకు చదువుతున్నాడు. తన తండ్రి రెవెన్యూశాఖలో చిరుద్యోగి. గ్రూపు –1 అధికారి కావాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు. 2023లో గ్రూపు –1 పరీక్ష రాసి సఫలీకృతుడు కాలేకపోయాడు. దీంతో తన తండ్రికి తోడుగా నిలవానుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో అరటి సాగుకు ఉపక్రమించాడు. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి 2.5 ఎకరాల్లో పచ్చివాల, 2.5 ఎకరాల్లో యాలక్కి రకాలు సాగుచేశాడు. ప్రస్తుతం పంట మరో నెలలో చేతికి రానుంది. కుప్పం మార్కెట్‌లో యాలక్కి కిలో రూ.70, పచ్చివాల రూ.30 ధర పలుకుతోంది. ఈ లెక్కన జ్ఞానప్రకాష్‌కి రూ.25 లక్షల వరకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది.
తోడైన దేవుడు
యువకుడు పడుతున్న కృషికి దేవుడు కూడా తోడయ్యాడు. కుప్పం ప్రాంతంలో వెయ్యికిపైగా అడుగుల లోతుకు బోరు వేసినా నీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ జ్ఞానప్రకాశ్ అరటి సాగుకు రెండు బోర్లు తవ్వగా.. కేవలం 105, 160 అడుగుల్లోన్నే పుష్కలంగా నీరు లభించింది.
పాడి సాగులో మరో లక్ష ఆదాయం
గత ఏడాది నుంచి జ్ఞానప్రకాష్ పాడి పెంపకం కూడా చేపట్టాడు. అరటి తోటలో వచ్చే పశుగ్రాసం, అరటి ఆకులు దాణాగా వినియోగిస్తున్నాడు. తండ్రి సహకారంతో రూ.5 లక్షలు ఖర్చు చేసి 10 పాడి ఆవులను పెంచుతున్నాడు. ప్రస్తుతం రోజూ ఆవులు పూటకు 75 లీటర్ల లెక్కన రెండు పూటలా 150 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. నెలకు రూ.1.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది.
గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా
మా తండ్రి రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఆయన పడుతున్న బా ధలు చూడలేక చిన్నప్పటి నుంచే గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా. మొదటి ప్రయత్నంలో ఒక్క పరీక్ష పోయింది. మరో పరీక్ష కోసం ఎదురు చూస్తు న్నా. ఇంతలో ఎలాగైనా తండ్రికి తోడుగా నిలవాలనుకున్నా. అదుకే 5 ఎకరాల పొలంలో రూ.5 లక్షలు వెచ్చించి అరటి సాగు చేపట్టా. వ్యాపారులు వచ్చి టోకుగా రూ.25 లక్షలకు తోటను అడుగుతున్నారు. బయట మార్కెట్‌కు తరలిస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. – జ్ఞానప్రకాష్,
యువ రైతు, గుల్లేపల్లి, కుప్పం మండలం
అరటి సాగులో అద్భుతాలు
అరటి సాగులో అద్భుతాలు


