
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మోహన్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 170 కళాశాలలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 10,236, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,724, ఒకేషనల్ మొదటి సంవత్సరం 810, ద్వితీయ సంవత్సరం 607 మొత్తం 15,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరందరికీ పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించాలని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు సమస్యలు లేకుండా ఆర్టీసు బస్సులు సకాలంలో నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర వైద్యసేవలకు కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను నియమించాలన్నారు. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌ఐఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.