
యాదమరి పీహెచ్‌సీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైద్యు
యాదమరి: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ మౌనిక సందర్శించారు. గురువారం ఆమె మండలంలోని బుడిగిపెంట గ్రామానికి చెందిన విజయదీప్(14)అనే బాలుడిని పరిశీలించారు. రెండు నెలలు క్రితం పలురకాల ఆరోగ్య రుగ్మతలతో చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స అనంతరం బాలుడికి సంబంధించిన ఆరోగ్య నివేదికలను జిల్లా వైద్యాధికారులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు పంపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి క్రమంలో ఇక్కడికి వచ్చిన డాక్టర్.. కాన్పు సమయంలో అందించిన వ్యాధి నిరోధక టీకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి ఎలాంటి సమస్య లేదని, కేవలం సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అతను కొంత కాలం పలు రుగ్మతలతో ఇబ్బంది పడ్డాడని, ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పారు. అనంతరం గ్రామంలోని రెండేళ్లలోపు చిన్నారులకు అందించిన వాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
యాదమరి: అక్రమంగా నిల్వ ఉంచి 10 టన్నుల రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు. గురువారం మండలంలోని పుల్లయ్యగారిపల్లిలో పురుషోత్తం నాయుడికి సంబంధించిన ప్రైవేటు భవనాన్ని కొంత మంది మొక్కజొన్న వ్యాపారం చేస్తామని లీజుకు తీసుకున్నారు. అయితే అందులో యాదమరికి చెందిన అబ్దుల్ సలాం, పలమనేరుకు చెందిన చెంగల్ రాయులు, కర్ణాటకకు చెందిన రోషన్, ప్రదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం నిల్వ చేసి, అక్రమ రవాణా చేస్తున్నారని స్థానిక తహసీల్దార్‌కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తన బృందంతో మెరుపు దాడులు చేసి, ఆ భవనంలో నిల్వ ఉంచిన 10 టన్నుల రేషన్ బియ్యం, క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పకడ్బందీగా ఆరోగ్య కార్యక్రమాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు పక్కాగా సేవలు అమలు చేయాలని సూచించారు. వారి నమోదు విషయంలో అలసత్వం వద్దని, ప్రసవ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. జన ఔషధిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు.