
కందిపప్పు దూరం
● రేషన్ షాపుల్లో ఇవ్వని పప్పు ● బియ్యం, పంచదారకే పరిమితం ● మార్కెట్‌లో చుక్కలంటుతున్న ధరలు ● ఆవేదన చెందుతున్న కార్డుదారులు
కలెక్టర్ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు
పునరుద్ధరించాలి
ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు దినుసు ధరలు కిలో రూ. 100 దాటింది. నూనె ధర రూ.150 పలుకుతోంది. ఇతర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో పేదలు నిత్యావసర సరుకులను కొనలేని పరిస్థితుల్లో ఉ న్నారు. నిరుపేదలకు అవసరమైన నిత్యవసర వస్తువులైన పంచదార, నూనె, చింతపండు, ఉల్లిపాయలు, చిరుధాన్యాలు, ఉప్పు, కారం, ఇతర వస్తువులను తక్కువ ధరకు అందించాలని కార్డుదారులు కోరు తున్నారు. చౌక ధరల దుకాణాల్లో నిలిపివేసిన కందిపప్పును తిరిగీ పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పేదలకు కందిపప్పు కరవుతోంది. చౌక దుకాణాల్లో రాయితీ ద్వారా అందించే పప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. అయిదు నెలల కిందట పప్పు పంపిణీని నిలుపుదల చేసింది. తద్వారా పేదలు కందిపప్పునకు దూరమయ్యారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర మోత మోగిపోతోంది. పేదలు మార్కెట్‌లో కొనలేని పరిస్థితి దాపురించింది. జనవరి నుంచి ఇప్పటి వరకు చౌకదుకాణాల్లో కందిపప్పు ఊసేలేదు. ఎండీయూ వాహనాలను రద్దు చేసినంత వేగంగా కందిపప్పు సరఫరాను ప్రభుత్వం ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు చిరు ధాన్యాలు కూడా ఇస్తామని చెప్పారని.. నాలుగైదు మాసాలుగా కంది పప్పునకే దిక్కు లేదని అపహాస్యం చేస్తున్నారు. రేషన్ కార్డు దారులకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా అందించే నిత్యావసర సరుకులు అంతంత మాత్రమే అందుతున్నాయని కార్డుదారులు వాపోతున్నారు.
పేదల అవస్థలు
బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర రూ.200 వరకు పలుకుతోంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు రూ.67కు విక్రయించేవారు. ఈ ధరకు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా లేకపోవడంతో సామాన్య ప్రజలు బయట మార్కెట్లో పెరిగిన ధరతో కందిపప్పును కొనేందుకు ఆర్థి క ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5.40 లక్షల రేషన్ కార్డులు, 1339 రేషన్ షాపులు న్నాయి. వీరందరి కోసం ప్రతినెలా 9 వేల మె ట్రిక్ టన్నుల బియ్యం, 543 మెట్రిక్ టన్నలు కందిపప్పు, 350 మెట్రిక్ టన్నుల చక్కెర అవసరమవుతోంది. గత ఐదు నెలల నుంచి బియ్యం, అర కిలో పంచదార మాత్రమే చౌక దుకాణాల ద్వారా సరఫరా అవుతోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు బయట మార్కెట్లో కొనలేక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బియ్యం, చక్కెర, రాగులు, రాగిపిండి, గోధుమపిండి, ఇతర నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరకు ప్రభుత్వం సరఫరా చేసింది. రాను రాను చౌక ధరల దుకాణాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జనవరి నెల ముందు వరకు చౌక ధరల దుకాణాలలో కందిపప్పు, బియ్యం, అర కిలో పంచదార సరఫరా అయ్యేవి. ప్రస్తుతం కందిపప్పును అయిదు నెలలుగా అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.