
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
చౌడేపల్లె: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఎస్ అగ్రహారంలో గురువారం చోటు చేసకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఏ.కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన కమలాకర్, హేమలత దంపతులకు లోకేష్(27) కుమారుడు ఉన్నాడు. కమలాకర్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్నేళ్ల కిందట పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ మృతి చెందాడు. దీంతో లోకేష్ తన తల్లి హేమలతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవని సాగించేవాడు. ఇటీవల తమ పొలంలోని 5ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాడు. అలాగే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐల తాకిడి అధికం కావడంతో ఆర్థిక భారం అధికమైంది. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ గ్రామంలో చీటీల నిర్వాహకుల నుంచి సైతం డబ్బులు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో ఆ విషయం తల్లి హేమలతకు తెలియడంతో లోకేష్‌ను మందలించింది. దీంతో గ్రామానికి సమీపంలోని యల్లమ్మ గుంత సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. చెట్టు కొమ్మకు వేళాడుతున్న లోకేష్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించి తల్లి హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కంట తడిపెట్టించిన పోన్ స్టేటస్..
లోకేష్‌కు చెందిన ఐపోన్‌లో స్టేటస్‌కు ఐయామ్ సారీ అంటూ దుఖంతో పెట్టిన స్టేటస్ చూసిన స్థానికులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. లోకేష్ ఎంత పని చేశావయ్యా అంటూ రోదించారు.

అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య