
మాకింత విషమిచ్చి.. భూములు తీసుకోండి
● పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా? ● సర్వేని అడ్డుకుని..అధికారులపై ఆగ్రహం
శాంతిపురం: ‘మాకు తలా ఇంత విషమిచ్చి.. మా ప్రాణాలు తీసేశాక మా భూములు తీసుకుని మీరు ప్యాక్టరీలు కట్టుకోండి. తరాలుగా అనుభవిస్తున్న భూములు పూర్తిగా లాక్కుని మీరిచ్చే కాసులు ఖర్చ య్యాక మేము వీధుల్లో అడుక్కుతినాలి.’ అని రైతు లు వాపోయారు. కుప్పం నియోజకవర్గంలోని రామ కుప్పం–శాంతిపురం మండలాల పరిధిలో ఇండస్ట్రీయల్ పార్కు కోసం దండికుప్పం, సిద్ధారెడ్లపల్లి, వెంకటేష్‌పురం, అమ్మవారిపేట గ్రామాల్లో భూ సేకరణ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు పాలెంగట్టు వద్ద గుమికూడి అడ్డుకున్నారు. పదేళ్ల క్రితం విమానాశ్రయం కోసం తీసుకున్న భూములు ఇప్పటి కీ వృథాగా ఉన్నాయని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయత్నం చేసినా సర్వే చేయనివ్వకపోవడంతో బుధవారం కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, శాంతిపురం తహసీల్దార్ శివయ్య, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ వెళ్లి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. తమను నిరాశ్రయులను చేసే అభివృద్ధి తమకు వద్దని రైతులు తెగేసి చెప్పారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడా పీఓ వికాస్ మర్మత్, కుప్పం డీఎస్పీ పార్థసారథి, అధికార పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తమ భూములను ఎలా సర్వే చేస్తారని రైతులు ప్రశ్నించారు. అభివృద్ధి కోసం నాయకులు వాళ్ల సొంత భూములను ఇచ్చాక తమ భూములకు రావాలని స్పష్టం చేశారు. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను వదిలిపెట్టి తమ పొట్టలు కొట్టవద్దని చెప్పారు. చదువు లేని తమకు పరిశ్రమల్లో ఏమి ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. మళ్లీ తమ భూముల జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, నాయకులు ఎంతగా చెప్పినా రైతులు అంగీకరించకపోవడంతో మళ్లీ కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు. బాధిత రైతులకు వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, బాధితుల్లో ఒకరైన కుప్పం రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి బాధితులకు సంఘీభావం తెలిపారు.
స్థానిక ఉపాధికి సహకరించండి
సీఎం చంద్రబాబుకు పలు సందర్భాల్లో కుప్పం ప్రజలు చేసిన వినతుల మేరకు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలు తెస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు వచ్చే పరిశ్రమలకు సహకరించాలని కోరారు. రైతులు సహకరించి భూములు ఇస్తే పరిహారంతో పాటు వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందరి అభ్యంతరాలు తీర్చాకే ముందుకు పోతామన్నారు. శాంతిపురం మండలంలోనే నైక్, అడిడాస్ కంపెనీలు ప్రారంభిస్తారని చెప్పారు.
ఏమి కావాలో అడగండి
పరిశ్రమలకు భూములు కోల్పోయేవారు తమకు, వారి పిల్లల భవిష్యత్తుకు ఏమి కావాలో అడిగితే సీఎం దృష్టికి తీసుకుపోతామని కడా పీఓ వికాస్ మర్మత్ చెప్పారు. వ్యవసాయం ద్వారా 15 ఏళ్లలో రానంత మొత్తాన్ని పరిహారంగా ఇప్పిస్తామన్నారు. పదేళ్ల క్రితం ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన వారికి రావాల్సిన రూ.14 కోట్ల పెండింగ్ బిల్లులు వడ్డీతో సహా ఈ నెలాఖరు లోపు అందుతాయన్నారు.