పీజీఆర్‌ఎస్ రద్దయినా విచ్చేసిన ప్రజలు
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక ) సోమవారం రద్దు అయ్యింది. అయినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు విచ్చేశారు. కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించే అధికారులు ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
దయచేసి న్యాయం చేయండి
ఇంటికి వెళ్లే దారిని అక్రమంగా ఆక్రమించుకున్నారని, దయచేసి న్యాయం చేయాలని పెనుమూరు మండలానికి చెందిన నాగభూషణం ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌కు విచ్చేసిన ఆయన తన సమస్యను వెల్లడించారు. పెనుమూరు మండలంలో సర్వే నంబర్ 467/1ఏ లోని 20 సెంట్ల భూమిలో 30 ఏళ్లుగా నివసిస్తున్నట్లు తెలిపారు. తమ ఇంటికి వెళ్లే దారి సర్వే నంబర్ 468/1 లో కుంటపోరంబోకు స్థలం ఉందన్నారు. గత 30 ఏళ్లుగా అదే దారిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. అయితే కళావతి అనే మహిళ ఆ దారిని ఆక్రమించి దారి లేకుండా ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు.
కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి
వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కోదండయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు యస్.నాగరాజులు డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు కార్మికులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కవిత, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మణి, మహిళా సమైక్య నగర కార్యదర్శి బి.కుమారి, హెచ్.బాలాజీ రావు, మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు జయశంకర్, సురేష్, బుల్లెమ్మ, కస్తూరి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.
కాలువ ఆక్రమించారు
చెరువు కాలువ భూమిని ఆక్రమించారని ఐరాల మండలానికి చెందిన బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు చెరువు కాలువను ఆక్రమించి తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కరించాలని గతంలో పీజీఆర్‌ఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.కలెక్టర్ తనకు న్యాయం చేయాలని అర్జీదారుడు కోరారు.
పీజీఆర్‌ఎస్ రద్దయినా విచ్చేసిన ప్రజలు
పీజీఆర్‌ఎస్ రద్దయినా విచ్చేసిన ప్రజలు


