చిత్తూరు అర్బన్ : కొత్తగా భవనాలు నిర్మించుకునే ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) ఇచ్చి, అనుమతులు తీసుకోవచ్చని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనంతపురం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీ) విజయ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు, తిరుపతి జిల్లాకు చెందిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ నాగేంద్రతో కలిసి ఇంజినీర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీ మాట్లాడుతూ.. 18 మీటర్లు / అయిదంతస్తుల లోపు భవనాలను నిర్మిస్తే స్వీయ ధ్రువీకరణ ఇస్తే చాలన్నారు. అయితే భవన యజమానులు వీటిని రిజిస్ట్రర్ ఎన్టీపీపీలు, ఇంజినీర్లు, ఆర్కెటెక్క్‌ల సమక్షంలో సరైన పత్రాలతో అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు సులువుగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి నూతనంగా తీసుకొచ్చిన ప్రభుత్వ ఆదేశాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రజలు దీనిపై ఏదైనా అనుమానాలుంటే ఆయా మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారి సుభప్రదతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.