అయ్యా..స్పందించండి! | - | Sakshi
Sakshi News home page

అయ్యా..స్పందించండి!

Mar 25 2025 1:34 AM | Updated on Mar 25 2025 1:31 AM

విచారణ నిర్వహిస్తున్న ఏసీ రామకృష్ణారెడ్డి

కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

● సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు

వివిధ సమస్యలపై 299 అర్జీలు

స్వీకరించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : ‘అయ్యా..చాలా దూరం నుంచి ప్రతివారం కలెక్టరేట్‌కు వస్తున్నాం .. మా సమస్యలు పరిష్కరించండి’.అంటూ ప్రజలు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. అన్ని శాఖలకు సంబంధించి 299 అర్జీలు నమోదుకాగా రెవెన్యూ శాఖకు మాత్రం 247 అర్జీలు వచ్చాయి. ప్రతివారం అధిక శాతం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు నమోదవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

అప్‌డేట్‌ కోసం వెళితే పేరునే మార్చేశారు

ఆధార్‌కార్డులో అప్‌డేట్‌ కోసం వెళితే పాప పేరునే మార్చేశారని బాధిత విద్యార్థిని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారించాలని బాలిక, కుటుంబసభ్యులు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. విద్యార్థిని పూర్ణిమ మాట్లాడుతూ తాను చిత్తూరు నగరంలోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆధార్‌ అప్‌డేట్‌ కోసం సచివాలయానికి వెళ్లగా అక్కడ పూర్ణిమకు బదులు సౌందర్య అని పేరు మార్చేశారన్నారు. సమస్య పరిష్కరించాలని సచివాలయంలో పలు మార్లు సంప్రదించినా న్యాయం చేయలేదని తెలిపారు.

ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదు

ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సొంతిళ్లు మంజూరు చేయడం లేదని పెనుమూరు మండలం విజయనగరం ఎస్టీ కాలనీకి చెందిన కళ్యాణి, గౌరి, యామని తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో తమ సమస్యను వెల్లడించారు. తమకు సొంతిళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సొంతిళ్లు మంజూరు చేయాలని మండల అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయం చేయాలని కోరారు.

సర్వే చేయించి..న్యాయం చేయండి

దొంగపట్టాలు చేయించుకున్నారని పరిశీలించి రికార్డుల్లో పేర్లు తొలగించాలని పెనుమూరు మండలం పులికల్లు హరిజనవాడ గ్రామస్తులు అశ్విని, తులసి, మునెమ్మ కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ పూర్వీకుల కాలం నుంచి తమ గ్రామంలోని సర్వే నంబర్‌ 1196,1197లో 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని ప్రభాకరన్‌ అనే వ్యక్తి ఆక్రమించుకుని దొంగ పట్టాలు చేయించుకున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లతో వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై గత కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేయించి ప్రభాకరన్‌ ఆ భూమిలోకి రానివ్వకుండా చేశారన్నారు. అదే భూమిని ప్రస్తుతం పులికల్లు హరిజనవాడకు చెందిన హరి అనే వ్యక్తి ప్రభాకరన్‌ ద్వారా పట్టాలు పొందినట్లు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు.

శ్మశానవాటిక ఆక్రమించుకున్నారు

తమ గ్రామంలోని శ్మశానవాటిక స్థలాన్ని అగ్రకులస్తులు ఆక్రమించుకున్నారని వెదురుకుప్పం మండలం శ్రీనివాసపురం గ్రామస్తులు యుగంధర్‌, నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో వారు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని శ్మశానస్థలాన్ని అగ్రకులస్తులు ఆక్రమించుకున్నారని చెప్పారు. ప్రశ్నించినందుకు దాడులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. మండల అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం చేయడంలేదని తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

అయ్యా..స్పందించండి!1
1/2

అయ్యా..స్పందించండి!

అయ్యా..స్పందించండి!2
2/2

అయ్యా..స్పందించండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement