తాగునీటి సమస్య లేకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య లేకుండా చూడండి

Mar 22 2025 12:29 AM | Updated on Mar 22 2025 12:28 AM

● క్రమం తప్పక ట్యాంకులను శుభ్రం చేయించాలి ● పంట నీటి కుంటలు నిర్మించండి ● పలు శాఖల వరుస సమీక్షలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని రక్షిత మంచి నీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను మండల స్పెషల్‌ ఆఫీసర్లు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెలాఖరు లోపు జిల్లాలోని అన్ని ఓవర్‌హెడ్‌ ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. అనంతరం జియోట్యాగింగ్‌ తో ఫొటోలు సమర్పించాలని కోరారు.

జిల్లాలో 15 రోజుల వ్యవధిలో 308 చేతి పంపులు మరమ్మతులు కాగా 233 రిపేర్లు చేయించినట్లు తెలిపారు. 190 పైప్‌లైన్‌ లీకేజీలను గుర్తించి మొత్తం అన్ని పైపులకు మరమ్మతులు చేపట్టామన్నారు. 225 పంపు సెట్‌లు మరమ్మతులను గుర్తించి 221 పంపు సెట్‌లకు మరమ్మతు చేయించినట్లు తెలిపారు.

గృహ నిర్మాణాల పురోగతిలో

అలసత్వం వద్దు

జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వ వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు హౌసింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో చేపట్టిన వివిధ దశల్లో ఉన్న 6,568 గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తి చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ప్రభుత్వం అందిస్తున్న అదనపు సహాయంను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదనపు సహాయానికి ఇప్పటి వరకు 16,406 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 6,388 మందికి సంబంధించి రూ.9.20 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. జిల్లాలోని పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో లే అవుట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో 175 అంగన్‌వాడీ భవనాలు మంజూరు కాగా రూ.47 లక్షలతో పూర్తి చేసినట్లు తెలిపారు.

జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి

జిల్లాలో జల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. పెద్ద ఎత్తున నీటి కుంటలను నిర్మించాలన్నారు. జల సంరక్షణ చర్యల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున పంట నీటి కుంటల నిర్మాణాలు చేపట్టాలన్నారు. జూన్‌ నెలాఖరు లోపు నీటి కుంటల నిర్మాణం చేపట్టేందుకు జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వేసవిలో ఉపాధి కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కూలీలకు తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమీక్షల్లో జెడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, డ్వామా పీడీ రవికుమార్‌, హౌసింగ్‌ పీడీ గోపాల్‌నాయక్‌, డీపీవో సుధాకర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement