బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్‌

Mar 14 2025 1:54 AM | Updated on Mar 14 2025 1:49 AM

● తాను మునిగి.. అందరినీ ముంచి ! ● ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు దోపీడీకి యత్నం ● ఉన్నది పోగొట్టుకుని.. కాళ్లు , నడుము విరగొట్టుకున్న వైనం ● సుబ్రమణ్యం నేర చరిత్రపై చిత్తూరు వాసుల ఆశ్చర్యం

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో జరిగిన దోపిడీ యత్న ఘటనలో ప్రధాన నిందితుడు సుబ్రమణ్యం విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎందుకంటే చిత్తూరులో సోఫాలు కొనేవాళ్లల్లో 60 శాతం మందికి పైగా ప్రజలు ఏదో ఒకసారి సుబ్రమణ్యం దుకాణానికి తప్పకుండా సందర్శించినవాళ్లే. ప్రజలతో పాటు కొందరు అధికారులు కూడా రెడ్డిగుంట సమీపంలో ఉన్న ఆ దుకాణాన్ని సందర్శించే ఉంటారు. దుకాణానికి వచ్చిన వాళ్లతో ‘అన్నా, రా అన్నా, కూర్చోనా..:!’ అంటూ ఆప్యాయంగా పలకరించడం. అధికారులు ఎవరైనా ఫైనల్‌ చేసిన బిల్లులో రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు తగ్గించి తీసుకోవడం ఇతడి నైజం. దీంతో తక్కువ కాలంలో ఇతడి దుకాణం పేరు నగరం మొత్తం పాకింది. ఇదే సమయంలో సోఫాలు చాలా మందికి అప్పులు ఇవ్వడం, పలువురి వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకుని సకాలంలో తిరిగీ చెల్లించకపోవడంతో సుబ్రమణ్యానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సంపాదించుకున్న బ్రాండ్‌తోనే వ్యాపారాన్ని విజయవంతం చేయాల్సిన అతను, అదే బ్రాండ్‌ను తాకట్టుపెట్టడంతో వ్యక్తిగతంగా ఇబ్బందులు తప్పలేదు. ఈ దుకాణంలో 50 మందికి పైగా కార్మికులు ప్రతి రోజూ పనిచేస్తుంటారు. వాళ్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో పలువురు దుకాణాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆర్థిక కష్టాలను గట్టెక్కడానికి దోపిడీ ప్లాన్‌ చేసిన సుబ్రమణ్యానికి తరచూ తాను గిఫ్ట్‌లు కొనుగోలు చేసే గాంధీరోడ్డులోని చంద్రశేఖర్‌ దుకాణం గుర్తుకు వచ్చింది. చంద్రశేఖర్‌ రోజూ బ్యాంకుకు వెళ్లడం, దుకాణంలోనే రూ.లక్షల విలువైన సరుకు ఉండటంతో ఇంట్లో రూ.కోట్లలో నగదు ఉన్నట్లు గుర్తించిన నిందితుడు దోపిడీకి ప్లాన్‌ చేశాడు. తన వద్ద పనిచేసే కుర్రాళ్లతో పాటు పాత పరిచయాలున్న వాళ్లను తీసుకొచ్చి దోపిడీకి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. అయితే సుబ్రమణ్యం గత చరిత్ర తవ్వితీసిన పోలీసులు ఇతనిపై నంద్యాలలో రెండు హత్య కేసులు, నాలుగు దోపిడీ కేసులు ఉండటంపై చాలా మందిని షాక్‌కు గురి చేసింది. పైగా ఓ దోపిడీ కేసులో పదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ యత్నం సమయంలో ఓ భవనం పైనుంచి కిందకు దూకిన సుబ్రమణ్యంకు రెండు కాళ్లు విరగడం, నడుము వద్ద ఎముకలకు బీటలు రావడంతో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. నేరచరిత్ర ఉన్న సుబ్రమణ్యం.. తాను మునిగిపోవడంతో పాటు తన వద్ద పనిచేసే వాళ్లను కూడా ముంచినట్లయ్యింది. మరోవైపు నిందితుల వద్ద ఉన్నది బొమ్మ తుపాకులని అప్పటికి తెలియక, మెడపై కత్తులు పెట్టినా ధైర్యంగా సాహసం చేసి నలుగురు నిందితులను నిర్భందించిన ఉమాపతి అతని స్నేహితులు నిజమైన హీరోలుగా మారారు. ఇదే సమయంలో నిందితుల వద్ద తుపాకులు ఉన్నాయని తెలిసి, బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు ధరించి, ఒక భవనం నుంచి మరో భవనంపైకి ఎక్కుతూ.. ఏ నిమిషం ఎలాంటి ఘటన ఎదురవుతుందో తెలియక ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను.. ప్రత్యక్ష్యంగా చూసిన ప్రజలు వారి సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్‌1
1/1

బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement