– విజయవాడ మహాధర్నాకు తరలి వెళ్లిన కార్యకర్తలు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి టీడీపీ ప్రభుత్వం డిమాండ్లు, హామీలు నెరవేర్చే వరకు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ జిల్లాలోని అంగన్‌వాడీలు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న మహాధర్నాను భగ్నం చేసేందుకు ఉన్నతాధికారులు, పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విజయవాడ ధర్నాకు వేలాదిగా కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్‌న్‌వాడీ కార్యకర్తలు విజయవాడ మహాధర్నాకు తరలివెళ్లారన్నారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న అంగన్‌వాడీలపై కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపించడం హేయమైన చర్య అని విమర్శించారు. అంగన్‌వాడీ అసోషియేషన్ జిల్లా కార్యదర్శులు లలిత, షకీలా మాట్లాడుతూ.. 30 ఏళ్లలో అంగన్‌వాడీలకు ఎప్పుడూ 10వ తేదీన ప్రాజెక్టు, సెక్టారు సమావేశాలు పెట్టింది లేదన్నారు. ధర్నాకు వెళ్లకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. సమావేశాలకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అన్యాయమన్నారు. అధికారుల బెదిరింపులకు ఆగిపోయిన కొందరు కార్యకర్తలు కేంద్రాలు తీయకుండా ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.