ప్రచారాలపై సమాచారం తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ప్రచారాలపై సమాచారం తప్పనిసరి

Published Sat, Apr 13 2024 12:35 AM

విలేకర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ షణ్మోహన్‌  - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటింటి ప్రచారానికి వెళ్లేముందు ఆయా పార్టీల అభ్యర్థులు ముందస్తుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షణ్మోహన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 29వ తేదీన ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 11 వేలకు పైగా ఉద్యోగులు, 23 వేలకు పైగా విభిన్నప్రతిభావంతులు, 6 వేలకు పైగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్‌బ్యాలెట్‌ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి బీఎల్‌ఓలు వెళ్లి ఫారమ్‌ 12 డి అందజేసి సుముఖత తీసుకుంటారన్నారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌లను శిక్షణ సమయంలోనే వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా వీడియో కవరేజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.2.29 కోట్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వోద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వేటు తప్పదని హెచ్చరించారు. కూడళ్లు, రోడ్లపై అభ్యర్థులు సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇళ్లపై చిన్న స్టిక్కర్లు వేసుకోవచ్చని, పెద్ద హోర్డింగ్‌ పెట్టుకోవాలంటే మాత్రం పర్మిషన్‌ పొందాలని స్పష్టం చేశారు. నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఖాతాలో ఎన్నికల ఖర్ఛు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి మించి ఖర్చు పెట్టకూడదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సి–విజిల్‌కు 386 ఫిర్యాదు వచ్చినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా గంగ జాతర నిర్వహించాలనుకుంటే అనుమతి తీసుకోవాలని, పోలింగ్‌ తర్వాత యథేచ్ఛగా జాతర జరుపుకోవచ్చని తెలిపారు. సమావేశంలోజేసీ శ్రీనివాసులు, డీఆర్‌ఓ పుల్లయ్య, ఆర్డీఓ చిన్నయ్య, నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement