తిరుమల : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.
● మొదటి (డౌన్) ఘాట్ రోడ్డులో 1వ మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేట్, అప్ ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి.
● రెండవ (అప్) ఘాట్ రోడ్డులో లాగా డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మించాలి.
● ఏ రకమైన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలి.
● ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలి.
● ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపేలా నిరంతరం కరపత్రాలు పంపిణీ చేయాలి.
● అంబులెన్‌న్స్‌లు , రెస్క్యూ టీమ్‌లు అవసరమైన పరికరాలతో సదా సన్నద్ధంగా ఉండాలి.
● ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.
ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, ఎఫ్‌ఏసీఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, టీటీడీ ఇంజినీరింగ్ సలహాదారు రామచంద్రారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ , బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, డాక్టర్ రవి ప్రభు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్ రెడ్డి పాల్గొన్నారు.