
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.
లారీ ఎల్లిసన్
ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.
మార్క్ జుకర్‌బర్గ్
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.
ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
జెఫ్ బెజోస్
వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.
లారీ పేజ్
గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్‌ఫర్డ్‌లోని పీహెచ్‌డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు.