రుణ గ్రహీతల్లో... మూడోవంతు మహిళలే

Women Borrowers form 28 per cent of India Retail Credit Consumer Base - Sakshi

రిటైల్‌ విభాగంలో 28 శాతానికి చేరిక

సిబిల్‌ నివేదికలో పలు అంశాలు

ముంబై: మహిళలు రుణాలను ఆశ్రయించే పరిస్థితి పెరుగుతోంది. రిటైల్‌ రుణాలు తీసుకుంటున్న వారిలో మహిళల శాతం 2020 సెప్టెంబర్‌ నాటికి 28 శాతానికి చేరినట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ సంస్థ వెల్లడించింది. రుణాలు తీసుకుంటున్న మహిళల శాతం 2014 నుంచి 21 శాతం మేర పెరిగినట్టు వివరించింది. 2014 నాటికి రుణాలు తీసుకునే మహిళలు 23 శాతంగానే ఉన్నారని పేర్కొంది. కానీ ఇదే కాలంలో రుణాలను ఆశ్రయించిన పురుషులు 16 శాతమే పెరిగారని.. మొత్తం మీద పురుషులతో పోలిస్తే మహిళలే ఈ కాలంలో ఎక్కువగా రుణ బాట పట్టారని.. రుణ మార్కెట్లో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 4.7 కోట్లకు చేరుకుందని సిబిల్‌ నివేదిక తెలియజేసింది. ‘‘రిటైల్‌ రుణాల్లో రూ.15.1 లక్షల కోట్లు నేడు మహిళలు తీసుకున్నవే. గత ఆరేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున పెరిగింది’’ అని వివరించింది. ‘‘కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తోడు, ఆర్థిక అవకాశాలను సొంతం చేసుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’’ అని సిబిల్‌ సీవోవో హర్షలా చందోర్కర్‌ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఇళ్ల కొనుగోలుపై స్టాంప్‌ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడం, మహిళలకు ప్రోత్సాహకంగా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్‌ చేస్తుండడం కూడా దీనికి తోడ్పడినట్టు చెప్పారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top