
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా న్యాయ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ప్రతిపాదించిన యాంటీట్రస్ట్ పరిష్కారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవి గూగుల్ సెర్చ్‌కు పూర్తి ప్రతికూలంగా ఉంటున్నాయని తెలిపారు. యూఎస్ డీఓజే ప్రాతిపాదనలు ‘దీర్ఘకాలికంగా అసాధారణమైనవి’గా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రణాళికలు సెర్చ్ ఇంజిన్ నిర్మాణానికి సవాలుగా మారుతాయని పేర్కొన్నారు.
సుందర్ లేవనెత్తిన కీలక ఆందోళనలు
డీఓజే ప్రతిపాదనలో భాగంగా గూగుల్ తన సెర్చ్ ఇండెక్స్, టెక్నాలజీతో సమకూరిన మార్జినల్ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది గూగుల్ పోటీ ప్రయోజనాన్ని నాశనం చేస్తుందని, ఆవిష్కరణలను అణిచివేస్తుందని పిచాయ్ వాదించారు. ప్రభుత్వ ప్రణాళిక దీర్ఘకాలికంగా అసాధారణమైనదని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ గత సంవత్సరం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు 49 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కంపెనీ టెక్నాలజీ మార్జినల్ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి వస్తే ఇలాంటి పెట్టుబడులను ఎలా కొనసాగించాలని పిచాయ్ ప్రశ్నించారు.
క్రోమ్‌పై ప్రభావం
క్రోమ్ సెక్యూరిటీ, అభివృద్ధిలో గూగుల్ గణనీయమైన పెట్టుబడి పెట్టినట్లు సుందర్ తెలిపారు. క్రోమ్ బ్రౌజర్‌ను బలవంతంగా విక్రయించాలనేలా డీఓజే పరిశీలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో జెమినీ ఏఐని చేర్చడానికి గూగుల్ సంప్రదింపులు జరుపుతోందని, ఇది నాన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్ వైపు మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలో వెపన్స్ తయారీ పెంపు
ఆగస్టులో తుది తీర్పు
2025 ఆగస్టులో ఈమేరకు పరిష్కార మార్గాలపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే యాంటీట్రస్ట్ తీర్పుపై అప్పీల్ చేయాలని యోచిస్తోంది. డేటా సేకరణ, సాంకేతికతలో అన్యాయమైన ప్రయోజనం ద్వారా గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని డీఓజే వాదిస్తుంది.