ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! | Why Relying Only on Corporate Health Insurance Could Cost You Dearly | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!

Mar 26 2026 12:15 PM | Updated on Mar 26 2026 12:44 PM

Why Relying Only on Corporate Health Insurance Could Cost You Dearly

‘నాకు కంపెనీ అందించే ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇంకేం పర్లేదు’.. సగటు ఉద్యోగి ధీమా ఇది. కానీ, ఆ ధీమా వెనుక ఒక ముప్పు పొంచి ఉందన్నది చేదు నిజం. ఆసుపత్రి బిల్లు చేతికి వచ్చాక ‘రూమ్ రెంట్ క్యాపింగ్’ పేరుతో సగం డబ్బులు కట్ అయినప్పుడో, లేదా అనుకోకుండా ఉద్యోగం పోయి హెల్త్ కవర్ రద్దయినప్పుడో కానీ ఆ కార్పొరేట్ పాలసీ ఎంత బలహీనమైనదో అర్థం కాదు.

వైద్య ఖర్చులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో కేవలం ఆఫీస్ ఇచ్చే పాలసీపైనే ఆధారపడటం అంటే.. వర్షం కురుస్తున్నప్పుడు చిల్లుల గొడుగు పట్టుకుని బయటకు వెళ్లడమే. జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ వంటి ప్రముఖులు సైతం ఈ విషయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నారు. అసలు ఆఫీస్ ఇన్సూరెన్స్‌లో మనకు తెలియని లోపాలేంటి? సొంతంగా ఒక పాలసీ ఉండటం ఎందుకు అత్యవసరం? తెలుసుకుందాం.

కార్పొరేట్ పాలసీల్లోని ‘ఫైన్ ప్రింట్’ చదివారా?

చాలా మంది ఉద్యోగులు తమ హెచ్‌ఆర్ ఇచ్చే పాలసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించరు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీకి తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని కవర్ చేసేలా రూపొందించబడుతుంది. ఇందులో ఉండే కొన్ని పరిమితులు అత్యవసర సమయంలో అవాంతరంగా మారవచ్చు.

గది అద్దెపై పరిమితి: మీ పాలసీలో రోజుకు గది అద్దె రూ.5,000 అని ఉందనుకుందాం. మీరు రూ.10,000 గదిని ఎంచుకుంటే కేవలం అద్దెలో వ్యత్యాసమే కాకుండా డాక్టర్ ఫీజులు, సర్జరీ ఖర్చుల్లో కూడా బీమా సంస్థ దామాషా పద్ధతిలో కోత విధిస్తుంది.

తక్కువ కవరేజీ: నగరాల్లో వైద్య ఖర్చులు ఏటా 15% వరకు పెరుగుతున్నాయి. ఒక మోస్తరు శస్త్రచికిత్సకే రూ.5-10 లక్షలు ఖర్చవుతున్న రోజుల్లో కంపెనీ ఇచ్చే రూ.3 లేదా 5 లక్షల కవరేజీ ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.

నియంత్రణ లేకపోవడం: పాలసీలో ఏయే జబ్బులు కవర్ కావాలి, ఏ యాడ్ఆన్‌లు ఉండాలి అనే నిర్ణయం కంపెనీదే తప్ప మీది కాదు.

ఉద్యోగం పోతే.. బీమా ఖేల్ ఖతం!

కార్పొరేట్ బీమాలో అతిపెద్ద లోపం ఇదే.  ఈ పాలసీ ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. మీరు రాజీనామా చేసినా, లేఆఫ్స్ వల్ల ఉద్యోగం కోల్పోయినా లేదా వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నా.. మరుక్షణమే మీ బీమా రక్షణ రద్దవుతుంది. ఒకవేళ ఆ విరామ సమయంలోనే అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏమిటి? కొత్త ఉద్యోగంలో చేరే వరకు మీకు ఎటువంటి రక్షణ అందదు.

సొంత పాలసీ ఎందుకు తప్పనిసరి?

వ్యక్తిగత ఆరోగ్య బీమాతో కలిగే ప్రయోజనాలు ఇవే..

చిన్న వయసులోనే మేలు: తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా ఎటువంటి వైద్య పరీక్షలు లేకుండానే పాలసీ లభిస్తుంది.

వెయిటింగ్ పీరియడ్: బీమా తీసుకున్న వెంటనే కొన్ని జబ్బులు కవర్ కావు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అప్పటికే వెయిటింగ్ పీరియడ్ పూర్తయి రక్షణ లభిస్తుంది.

నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్ చేయని ప్రతి ఏటా మీ బీమా మొత్తం పెరుగుతూ పోతుంది. ఇది రిటైర్మెంట్ సమయానికి పెద్ద రక్షణ కవచంగా మారుతుంది.

పన్ను ప్రయోజనం: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80D కింద వ్యక్తిగత పాలసీకి చెల్లించే ప్రీమియంపై మినహాయింపు పొందవచ్చు. కంపెనీ పాలసీలో ఈ ప్రయోజనం ఉండదు.

ఇప్పుడేం చేయాలి?

కార్పొరేట్ బీమాను వదులుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాథమిక రక్షణగా వాడుకుంటూనే ఒక వ్యక్తిగత పాలసీని కలిగి ఉండటం మంచి నిర్ణయం. చిన్న క్లెయిమ్‌లకు ఆఫీస్ బీమాను, పెద్ద ఆపదలు వస్తే మీ సొంత పాలసీని వాడుకోవచ్చు. చివరగా.. ఉద్యోగాలు మారతాయి, కంపెనీ పాలసీలు మారతాయి, కానీ మీ ఆరోగ్యం, మీ ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే ఉండాలి.

ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement