మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! | West Asia Tensions Ignite Gas Shock Driving Up India Liquor Bottle Costs | Sakshi
Sakshi News home page

మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!

Apr 3 2026 9:26 AM | Updated on Apr 3 2026 10:43 AM

West Asia Tensions Ignite Gas Shock Driving Up India Liquor Bottle Costs

పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్‌లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.

బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగ

మద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్‌లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్‌ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.

ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?

ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.

బీర్ కొరత పొంచి ఉందా?

వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్‌లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.

ఇన్వెంటరీయే రక్షణ కవచం

ప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement