యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు! | West Asia Conflict Threatens Global Energy Supply SEBI Chief Warns CII Summit | Sakshi
Sakshi News home page

యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

Apr 6 2026 1:27 PM | Updated on Apr 6 2026 1:40 PM

West Asia Conflict Threatens Global Energy Supply SEBI Chief Warns CII Summit

చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆంక్షలకు దారితీసి అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సీఐఐ) నిర్వహించిన కార్పొరేట్ గవర్నెన్స్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కార్పొరేట్ రంగం ఎదుర్కోవాల్సిన సవాళ్లపై వ్యాఖ్యలు చేశారు.

సంక్షోభంలో ప్రపంచం

గత కొన్నేళ్లుగా వ్యాపార సంస్థలు, నియంత్రణ సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పాండే గుర్తుచేశారు. ‘కొవిడ్ సృష్టించిన అస్థిరత నుంచి కోలుకోకముందే కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతిక మార్పులు వ్యవస్థలను పరీక్షించాయి. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి ప్రమాదంలోకి నెట్టేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంస్థాగత అంశాలు, బలమైన పాలనా పద్ధతులు అత్యంత అవసరమన్నారు.

కార్పొరేట్ గవర్నెన్స్‌లో మార్పు

కంపెనీల బోర్డులు కేవలం నామమాత్రంగా ఉండకూడదని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో నాణ్యత పెరగాలని సెబీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ‘బోర్డు సభ్యులుగా ఎవరున్నారన్న దానికంటే వారు సంస్థ పర్యవేక్షణలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ముఖ్యం. పటిష్టమైన పాలనా ప్రమాణాల అమలులో స్వతంత్ర డైరెక్టర్లే కీలకం. వారి పనితీరును మెరుగుపరిచేందుకు సెబీ త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. పెరుగుతున్న సంక్లిష్ట వ్యాపార వాతావరణంలో స్వతంత్ర డైరెక్టర్లకు శిక్షణ, అవగాహన కల్పించడానికి ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సెబీ యోచిస్తోంది’ అన్నారు.

నిరంతర పర్యవేక్షణే మార్గం

పాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా కాలానుగుణ సమీక్షల స్థానంలో నిరంతర పర్యవేక్షణ పద్ధతిని తీసుకురావాలని పాండే సూచించారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడమే తదుపరి దశ పాలనా సంస్కరణల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా భారతీయ కంపెనీలు తమ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని ఈ సదస్సు వేదికగా సెబీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement