ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ 2026 మోడల్ సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది.
కంఫర్ట్‌లైన్, హైలైన్, హైలైన్ ప్లస్, టాప్‌లైన్, జీటీ లైన్, జీటీ ప్లస్ క్రోమ్, జీటీ ప్లస్ స్పోర్ట్ అనే ఏడు ట్రిమ్‌లలో లభించే టైగన్ కారు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. 2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్‌లిఫ్ట్ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది.
పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్‌ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్‌లో అందుబాటులో ఉంది.
కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.


