‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’ | US Judge Blocks Trump Era Immigration Ban Discriminatory Policy Ruled Illegal | Sakshi
Sakshi News home page

‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’

May 1 2026 1:25 PM | Updated on May 1 2026 2:06 PM

US Judge Blocks Trump Era Immigration Ban Discriminatory Policy Ruled Illegal

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.

కేసు నేపథ్యం

ఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.

న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలు

ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్‌) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్‌దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్‌సీఐఎస్‌ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.

న్యాయ నిపుణుల స్పందన

ఈ తీర్పును పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్‌సీఐఎస్‌ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.

ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement