‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’

UPI Transaction Value Jumped By 105 Percent in 2020 - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు డబ్బులను పంపించడం కోసం ఆన్‌లైన్ చెల్లింపులు మీద ఆధారపడుతున్నారు. దీంతో 2020లో యూపీఐ లావాదేవీల విలువ 105 శాతం పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ) 2019 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు లావాదేవీల విలువలో 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్ చివరిలో యుపీఐ ప్లాట్‌ఫాం లావాదేవీల మొత్తం విలువ రూ.2,02,520.76 కోట్లుకు పైగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 2020 డిసెంబర్ నాటికి రూ.4,16,176.21 కోట్లకు చేరుకుంది.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?)

గత ఏడాది 2020 సెప్టెంబర్‌లో రూ.3 లక్షల కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది. యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా 2019 డిసెంబర్ చివరి నాటికి 1308.40 మిలియన్ లావాదేవీలను జరపగా.. అదే 2020 డిసెంబర్ చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 2234.16 మిలియన్లకు చేరుకుంది. యుపీఐ ప్రతి నెలా లావాదేవీల సంఖ్య అక్టోబర్ నుండి రెండు బిలియన్ల మార్కును దాటుతోంది. అక్టోబర్ 2020లో మొదటిసారి ఈ సంఖ్యను దాటింది. అయితే, ఇటీవల ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధిస్తారనే రూమర్లు బాగా వినిపిస్తాయి. మొత్తానికి ఈ ప్రచారం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరిపే వారికి ఇది గొప్ప ఉపశమనం. ఎప్పటి లాగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top