గ్యాస్ ఒప్పందాలపై ఖతార్ హామీ
న్యూఢిల్లీ: భారత్‌కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్ షెరీదా ఆల్‌కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు.
ఖతార్ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్ అవసరాల్లో 45 శాతం ఎల్‌ఎన్‌జీ, 20 శాతం ఎల్‌పీజీని ఖతార్ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్ పర్యటనకు వెళ్లడం గమనార్హం.


