
భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌ల్లో షోరూమ్ బుకింగ్‌లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.
ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.
‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు