రికార్డు స్థాయికి హోల్డింగ్స్
టాప్ 3 లిస్టెడ్ కంపెనీల దగ్గర 334 టన్నులు
గత ఏడాది 20 టన్నుల పెరుగుదల
న్యూఢిల్లీ: పసిడి ధర, రుణాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం రుణాల కంపెనీల దగ్గర హోల్డింగ్స్ భారీగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మూడు లిస్టెడ్ గోల్డ్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ దగ్గర మొత్తం బంగారం 20 టన్నులు పెరిగి రికార్డు స్థాయిలో 334 టన్నులకు చేరింది. పలు దేశాల దగ్గరున్న నిల్వల కన్నా ఇది అధికం కావడం గమనార్హం.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం బ్రిటన్ దగ్గర 310 టన్నులు, బ్రెజిల్ వద్ద 172 టన్నులు, సింగపూర్ దగ్గర 194 టన్నుల బంగారం ఉంది. ఈ మూడు సంస్థల దగ్గరున్న హోల్డింగ్స్ భారతదేశపు వార్షిక పసిడి దిగుమతుల్లో దాదాపు సగం (46 శాతం). కేంద్ర వాణిజ్య శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు దాదాపు 5 శాతం తగ్గి 721 టన్నులకు పరిమితమయ్యాయి.
2026 మార్చి ఆఖరు నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద గతేడాది నమోదైన 879.6 టన్నుల స్థాయికి దాదాపు దరిదాపుల్లో మొత్తం 880.5 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. ఇందులో 680 టన్నులను దేశీయంగా నిల్వ చేస్తుండగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్ల్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద 197.7 టన్నులు నిల్వ చేస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ల రూపంలో మరో 2.8 టన్నులు ఉన్నాయి.
ఐఐఎఫ్‌ఎల్ ః 19 టన్నులు ..
గత ఆర్థిక సంవత్సరంలో ఐఐఎఫ్‌ఎల్ వద్ద పసిడి అత్యధికంగా 19 టన్నులు పెరిగింది. దాదాపు 60 టన్నులకు చేరింది. వాస్తవానికి 2024 మార్చి నుంచి ఆరు నెలల పాటు పసిడి రుణాలివ్వకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ గోల్డ్ లోన్ వ్యాపార విభాగంపై గణనీయంగా ప్రభావం పడింది. అయితే, ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత వ్యాపారం క్రమంగా పుంజుకుంది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా ఏడు శాతం తగ్గినప్పటికీ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర పసిడి హోల్డింగ్స్ అత్యధికంగా 209 టన్నులు ఉన్నాయి.
ధర అధిక స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలోనే బంగారాన్ని తనఖా పెట్టి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకునేందుకు వీలుండటం ఇందుకు కారణమని విశ్లేషకులు తెలిపారు. అటు మూడో లిస్టెడ్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన మణప్పురం ఫైనాన్స్ వద్ద పసిడి హోల్డింగ్స్ ఏడు టన్నులు (11.7 శాతం) పెరిగాయి. రికార్డు స్థాయిలో 63 టన్నులకు చేరాయి. మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీల ఒత్తిడి కనిపిస్తున్న నేపథ్యంలో మణప్పురం తమ పసిడి రుణాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతుండటమనేది కంపెనీ దగ్గర బంగారం హోల్డింగ్స్ పెరుగుదలకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి.


