కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్‌ తక్కువ, వయబులిటీ ఎక్కువ? | Telangana CM Revanth Reddy Taken Decision For Construction Of Airport And Metro Rail Route, See Details Inside - Sakshi
Sakshi News home page

కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్‌ తక్కువ, వయబులిటీ ఎక్కువ?

Published Thu, Dec 14 2023 6:51 PM

Telangana CM Revanth Reddy Taken Decision For Construction Of Airport Metro Rail - Sakshi

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్‌ రెడ్డి' కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్‌ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్‌ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్‌ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్‌మెంట్ ఔటర్‌ రింగ్ రోడ్డుగుండా వెలుతుందని, దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్‌ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు.

కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్‌ నగరం నలువైపులా అభివృద్ధి సమానంగా జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్‌మెంట్‌ మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి హైదారాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌కు సూచించారు. 

దీన్ని బట్టి ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు మార్గాన్ని ఎంచుకోవడం లేదా.. ఇప్పటికే ఎల్‌బీనగర్ రూట్లలో మెట్రో ఉంది కాబట్టి, చాంద్రాయణగుట్ట రూట్‌ ద్వారా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టేలా చూడాలని HMRL ఎమ్‌డిని కోరారు.  దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు మెట్రోను వినియోగించుకునే అవకాశంతో పాటు అటు మెట్రోరైల్‌కు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  అంతే కాకుండా మైండ్‌ స్సేస్‌ రూట్‌ ద్వారా మెట్రో నిర్మిస్తే దాదాపుగా 31 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. అదే ఎల్‌బినగర్‌ రూట్‌ ద్వారా నిర్మిస్తే ఈ డిస్టెన్స్‌ మరో 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది.

ఈ రూట్‌లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు. ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.

మొదటి ఫేజ్‌లో నిర్మించకుండా మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూట్‌ పూర్తైతే పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోకు సంబంధించి 6 వేల 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాలని తొలత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ కారిడార్‌ కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా కిలోమీటర్‌ మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు.

విమానాశ్రయంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన సమీక్షలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేల రూట్‌ మార్చాల్సి వస్తే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్‌మెంట్‌ నిలిపివేయాల్సి వస్తే జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
 
హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉంది, భవిష్యత్తులో ఈ సంఖ్య 3 కోట్లకు చేరే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను, తూర్పు నుంచి పడమర వరకు.. మూసీ మార్గంలో నాగోల్‌ నుంచి గండిపేట్‌ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది.

Advertisement
 
Advertisement